Jan 04,2023 15:31

సిసిఐ జరిమానాలో 10% డిపాజిట్‌ చేయాల్సిందే
న్యూఢిల్లీ : దిగ్గజ సర్చింజన్‌, టెక్‌ కంపెనీ గూగుల్‌కు నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి)లో ఎదురుదెబ్బ తగిలింది. కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) విధించిన జరిమానాలో పదిశాతం డిపాజిట్‌ చేయాలని గూగుల్‌ను బుధవారం ఆదేశించింది. ఆండ్రాయిడ్‌ మొబైళ్ల వినియోగంలో గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై గతేడాది సిసిఐ రూ.1,337.76 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని సూచించింది. సిసిఐ ఆదేశాలను సవాల్‌ చేస్తూ గూగుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు ట్రిబ్యునల్‌ అంగీకరించింది. గూగుల్‌ అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన ఇద్దరు సభ్యుల బెంచ్‌.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. ఇతరుల వాదనలు కూడా విన్నాక పూర్తి స్థాయి ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సిసిఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 13కి వాయిదా వేసింది. ''ఆండ్రాయిడ్‌ వల్ల భారత యూజర్లు, మొబైల్‌ తయారీ కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయని, భారత డిజిటల్‌ ప్రయాణంలో ఆండ్రాయిడ్‌ కీలక పాత్ర పోషించిందని పేర్కొంది. సిసిఐ ఉత్వర్వులతో ఆ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.'' అని గూగుల్‌ ఎన్‌సిఎల్‌టికి వివరణ ఇచ్చింది. దేశంలో ఎలాంటి విచారణా జరపకుండా యూరోపియన్‌ కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను సిసిఐ డైరెక్టర్‌ జనరల్‌ కాపీ కొట్టారని ఆరోపించింది. ఆ ఆదేశాలను కొట్టివేయాలని గూగుల్‌ ఎన్‌సిఎల్‌టిని కోరింది.