Oct 17,2023 12:54

హైదరాబాద్‌ : తెలంగాణాలో వచ్చే నెల నవంబర్‌ 30వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ ఎన్నికల పోరులో గెలుపొందాలని ఒక పార్టీకి మించి మరొకపార్టీ పోటీపడుతున్నాయి. కర్ణాటకలో గెలుపొందిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ తెలంగాణలో గెలుపొందాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఫార్ములానే తెలంగాణాలోనూ మహిళా ఓటర్లనే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోను రూపొందించనుంది. గతంలో కెసిఆర్‌ వధువులకు ఉపయోగకరంగా 'కల్యాణ లక్ష్మీ' పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం పేరు మార్చి 'మహాలక్ష్మీ' స్కీంగా కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో చేర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పథకం కింద వధువుకు 10 గ్రామలు బంగారం, అలాగే వధువు కుటుంబానికి లక్ష రూపాయల్ని అందజేసేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ శ్రీధర్‌బాబు మంగళవారం తెలిపారు. అయితే ఈ సిఫార్సు ఫైనల్‌ కాదని.. ఈ హామీ అమలుపై పిసిసి, ఎఐసిసి తీసుకున్న నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని శ్రీధర్‌బాబు అన్నారు.
కాగా, ఇప్పటికే కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో 'మహాలక్ష్మీ' పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500, రూ.500లకే ఎల్‌పిజి సిలిండర్‌, మహిళలకు ఉచిత ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలనిచ్చింది.