వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొట్టచ్చినట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ టెక్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెజాన్, మెటా, ట్విట్టర్, జమాటో బాటలోనే తాజాగా గూగుల్ మాతృసంస్థ అల్బాబెట్ కూడా భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు సమాచారం. ఖర్చు తగ్గించుకునే పనిలో గూగుల్ 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిచడానికి కసరత్తు చేస్తోందని మంగళవారం నివేదికలు వచ్చాయి. వ్యయాలను తగ్గించుకోవాలంటూ ఇన్వెస్టర్ల ఒత్తిడి మేరకు ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకుంటున్నట్లు టెక్ కంపెనీలన్నీ సాకుగా పేర్కొంటున్నాయి. గూగుల్ కూడా అదే వాదన వినిపిస్తోంది. ప్రస్తుత ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 6 శాతం మందికి కోత పెట్టాలని గూగుల్ యోచిస్తోంది. తొలుత అత్యల్ప ర్యాంక్ ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ఈ విషయమై ఇప్పటికే మేనేజర్లకు సూచనలు చేసిందని తెలుస్తోంది. ఆల్ఫాబెట్‌లో దాదాపు 1,87,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.










