Jul 07,2023 22:16

కరాచీ: భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమేనని పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ వెల్లడించాడు. ''మేం ప్రపంచకప్‌ ఆడేందుకు వెళ్తున్నాం. అంతేకానీ కేవలం భారత్‌తోనే ఆడేందుకు కాదు. కేవలం ఒక్క మ్యాచ్‌ మీద, ఒక్క టీమ్‌పై దృష్టిపెట్టం. మేం కాకుండా మరో తొమ్మిది జట్లు ఆడుతున్నాయి. వారందరితో ఆడి విజయం సాధిస్తేనే ఫైనల్‌కు చేరుకునేందుకు అవకాశం ఉంది. ప్రొఫెషనల్స్‌గా ఆడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా వెళ్తాం. అక్కడ ఆడతాం. ప్రతిదేశంలో మా ప్రదర్శన ఏంటో చూపిస్తాం అన్నాడు. అలాగే శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఎదురు చూస్తున్నాం. కొద్దిరోజుల విరామం తర్వాత మైదానంలో దిగబోతున్నందుకు ఉత్సాహంగా ఉంది. ఇప్పటి నుంచే ప్రపంచ కప్‌ టోర్నీకి సన్నాహాలు ప్రారంభిస్తాం. శ్రీలంకతో సిరీస్‌ అనంతరం ఆసియా కప్‌ ఆడాల్సి ఉంది. లంకతో మ్యాచ్‌లు ఆడటం వల్ల మినీ టోర్నీలో అనుభవం అక్కరకొస్తుంది'' అని బాబర్‌ తెలిపాడు. ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్‌ జరగనుంది.