Oct 01,2023 16:22

-బిఆర్‌ఎస్‌, మజ్లిస్‌లు ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీలా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి
ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసిందని, పసుపుపై పరిశోధనలు పెరిగాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌లో ఆదివారం పర్యటించిన మోడీ.... రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన ప్రజాగర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాలో రూ.900 కోట్లతో సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. హైవేల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణ అనుసంధానం పెరిగిందన్నారు. దేశంలో నిర్మించే ఐదు టెక్స్‌టైల్‌ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామని, హన్మకొండలో నిర్మించే టెక్స్‌టైల్‌ పార్క్‌తో వరంగల్‌, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణలోని బిఆర్‌ఎస్‌ సర్కారు స్టీరింగ్‌ మజ్లీస్‌ చేతిలో ఉందని విమర్శించారు. అవినీతి, కమీషన్లకు పేరుగాంచిన ఆ రెండు కుటుంబాలూ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీల మాదిరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని విమర్శించారు. ఆ కంపెనీలో డైరెక్టర్‌, మేనేజర్‌, సెక్రటరీ అన్ని పదవులూ ఆ కుటుంబ సభ్యులవేనని ఎద్దేవా చేశారు. కొన్ని అవసరాల కోసం కొందరిని సహాయకులుగా నియమించుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపిలు కె.లక్ష్మణ్‌, బండి సంజరు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు, మాజీ మంత్రి డికె అరుణ తదితరులు పాల్గొన్నారు.