ముంబయి: ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్ వేదికలు ఖరారయ్యాయి. పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా 2023 ఆసియాకప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఎసిసి) గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 31నుంచి సెప్టెంబర్ 17వరకు ఈ టోర్నమెంట్ జరగనున్నట్లు ఎసిసి ఆ ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్‌లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో ఆతిథ్య పాకిస్తాన్, శ్రీలంకతోపాటు భారత్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ జట్లు పాల్గోనున్నాయి. మొత్తం 13వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి టోర్నీలో తలపడే ఆరుజట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లోని ఒక జట్టు మిగిలిన రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. అనంతరం సూపర్‌ా4 స్టేజ్‌లో ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.










