ప్రజాశక్తి-నార్పల : నార్పల మండలంలోని మండల కేంద్రమైన నార్పల, బి.పప్పూరు పశువైద్యశాలల్లో మందులు లేవని పశు వైద్యులు వైద్య సిబ్బంది అంటున్నారని నార్పల మండలంలోని పలువురు పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నార్పల ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో శోధనపల్లి ఎంపీటీసీ కాటమయ్య మాట్లాడుతూ శోధనపల్లి మంగపట్నం గ్రామాల్లో ముద్ద చర్మవ్యాధి వ్యాక్సినేషన్ అసలు చేయలేదన్నారు. పప్పూరు గ్రామ సర్పంచ్ పెద్దన్న మాట్లాడుతూ పప్పూరు పశు వైద్యశాలకు వెళ్తే స్పందించే నాధుడే కరువని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశంలో నార్పల వెటర్నరీ డాక్టర్ గోవిందరాజులును నార్పల మండలంలోని పాడి రైతుల ఇబ్బందులు పశువైద్యశాలల్లో మందుల కొరతపై పలువురు ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు ప్రశ్నించగా వైద్యశాలల్లో మందుల కొరత ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. ఉన్న మందులతో తాము వైద్యం చేస్తున్నామని లేని మందులను బయట నుంచి తెచ్చుకోవాలని రైతులకు చెప్తున్నామని పైనుంచి మందులు సప్లై రాని దానికి తాము ఏమి చేస్తామని అని అన్నారు. ఆర్థికంగా బాగా ఉన్న రైతులు బయట నుండి మందులు తెచ్చుకొని పశువులకు వైద్యం చేయించుకుంటున్నారని ఒకటి రెండు బర్రెలు పెట్టుకుని పాలు అమ్ముకొని వాటిపైనే ఆధారపడి జీవనం సాగించే చిన్న రైతులు వైద్యులు రాసిచ్చే ఖరీదైన మందులు బయటనుండి తెచ్చుకోలేక వైద్యశాలలో సరైన వైద్యం అందక సతమతమవుతున్నారు. ప్రభుత్వం పాడి రైతులకు ఆదాయం కల్పించడానికి గ్రామాల్లో ప్రభుత్వ పాల కేంద్రాలు ఏర్పాటుచేసి పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వ పాలకులు అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పడకేసిన పశు వైద్యం మందుల కొరత గురించి స్పందించి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు మండలంలోని నార్పల, బి. పప్పురు పశువైద్యశాలలకు తగినన్ని మందులు సరఫరా చేయాలన్నారు. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశాలు జరిగినప్పుడు ప్రశ్నించడం సమస్యను పక్కన పెట్టడం పరిపాటిగా మారిపోయిందని అలాకాకుండా రైతులతో కలిసి వెళ్లి ఎప్పటికప్పుడు పశు వైద్యశాలలను పరిశీలించి ఎన్ని మందులు వస్తున్నాయి, ఎన్ని మందులు స్టాక్ ఉన్నాయి, వైద్యులు వైద్య సిబ్బంది ఏ సమయానికి వస్తున్నారు, ఏ సమయానికి వెళ్తున్నారు అని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటే మండలంలోని పాడి రైతులకు న్యాయం జరుగుతుందని పలువురు పాడి రైతులు అంటున్నారు.










