Sep 27,2020 22:03

logo


టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు ఎంపిక
అనంతపురానికి 'కాలవ'... హిందూపురానికి 'బికె'
కర్నూలు సమన్వయకర్తగా ప్రభాకర్‌చౌదరి
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి

తెలుగుదేశం పార్టీని జిల్లాలో నడిపించే బాధ్యతలను సీనియర్‌ నాయకులకే అధిష్టానం కట్టబెట్టింది. గతంలో లాగా జిల్లా కమిటీలు కాకుండా ఈసారి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి కాలవ శ్రీనివాసులు, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి బికె.పార్థసారథిని నియమించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రకటించారు. రెండు పార్లమెంటు కమిటీలకు కర్నూలు జిల్లాకు చెందిన బిటి.నాయుడుని సమన్వయకర్తగా నియమించారు.
సామాజిక సమీకరణల నేపథ్యం
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈ జిల్లాకు మంచి ఆదరణ లభిస్తూ వచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉరవకొండ, కదిరి మినహా తక్కిన 12 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో రివర్సులో స్థానాలను కోల్పోయి ఉరవకొండ, హిందూపురానికి మాత్రమే పరిమితం అయ్యింది. 12 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లోనూ వైసిపి గెలుపొందింది. ఇంతటి ఘోర పరాజయాన్ని చాలాకాలం తరువాత తెలుగుదేశం పార్టీ జిల్లాలో చవిచూసింది. ఈ నేపథ్యంలో జిల్లా సారథ్య బాధ్యతలు ఎవరు చేపడతారన్న దానిపై సర్వత్రా చర్చసాగుతూ వచ్చింది. సీనియర్లను కాదని కొత్త వారికి అవకాశమిస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే పార్టీ కష్టకాలంలో సీనియర్లపైనే నమ్మకం ఉంచుకున్నట్టు కనిపిస్తోంది. చాలాకాలం పాటు పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉంటూ వచ్చిన కాలవ శ్రీనివాసులుకు అనంతపురం పార్లమెంటు బాధ్యతలను అప్పగించింది. ఈయన 2014కు ముందు వరకు పార్లమెంటుకు పోటీ చేస్తూ వచ్చారు. ఒకసారి ఎంపిగానూ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో రాయదుర్గం నియజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందటమే కాకుండా మంత్రి కూడా పని చేశారు. ఇక బికె.పార్థసారధి చాలాకాలంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన హిందూపురం పార్లమెంటు కమిటీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గానూ, పార్లమెంటు సభ్యుడిగానూ, ఎమ్మెల్యేగానూ పనిచేసిన అనుభవం ఆయనకుంది. రాజకీయంగా ఇద్దరు కూడా చాలా అనుభవమున్న వారు. పార్టీని కష్టకాలంలో నడిపించేందుకు సీనియర్లు అయితేనే బాగుంటుందన్న నమ్మకంతో అధిష్టానం బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. కాలవ, బికెలను అధ్యక్షులుగా ప్రకటించడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా రాయదుర్గం, పెనుకొండలో టిడిపి శ్రేణులు బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు.
అనంతకు బిటి నాయుడు ... కర్నూలుకు ప్రభాకర్‌ చౌదరి
అనంతపురం జిల్లాలోని రెండు కమిటీలకు సమన్వయకర్తగా కర్నూలు జిల్లాకు చెందిన బిటి నాయుడును నియమించారు. గతంలోనూ ఈయనే సమన్వయకర్తగా ఉంటూ వచ్చారు. తిరిగి ఇప్పుడు అవే బాధ్యతలు ఆయనకు అప్పగించారు. అనంతపురం అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి కర్నూలు, నంద్యాల పార్లమెంటు కమిటీల సమన్వయకర్తగా నియమించారు.