Nov 07,2020 23:29

లబ్ధిదారులతో గృహ సముదాయంలో ధర్నా చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-ఆదోని: వచ్చే సంక్రాంతిలోపు టిడ్కో గృహాల్లో లబ్ధిదారులకు ప్రవేశం కల్పించాలని తెలుగు యువత రాష్ట్ర నాయకులు భూపాల్‌ చౌదరి డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణ శివారులోని శిరుగుప్ప రోడ్డులోని టిడ్కో గృహ సముదాయం ముందు లబ్ధిదారులతో కలిసి ధర్నా చేపట్టారు. చెక్‌ పోస్టు నుంచి గృహ సముదాయం వరకూ పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా భూపాల్‌ చౌదరి మాట్లాడారు. పట్టణంలో 4,703 గృహాల నిర్మాణం పూర్తయిందని, అందులో టిడిపి హయాంలో 2 వేల గృహాల్లో ప్రవేశాలు కూడా చేశారని తెలిపారు. పూర్తయిన ఇళ్లను పేదలకు కేటాయించడంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రూ.500 నుంచి రూ.50 వేల వరకూ ఇళ్ల కోసం డిపాజిట్లు కట్టామని, అధికారులు, ప్రభుత్వం గానీ స్పష్టత ఇవ్వడం లేదని లబ్ధిదారులు సావిత్రి, ఇస్మాయిల్‌ వాపోయారు. రాజకీయ ప్రయోజనం చూడకుండా పేదల అవసరాలను తీర్చాలని లబ్ధిదారులు లక్ష్మి, మహబూబ్‌ బాష కోరారు. టిడిపి మాజీ కౌన్సిలర్లు తిమ్మప్ప, మారుతి, నాయకులు బుద్ధారెడ్డి, ఫారూక్‌, కృష్ణారెడ్డి, రంగస్వామి, అంజి, సజ్జాద్‌, కాశీ, జయరాం, సుబ్బు, చిన్నా, వీరేష్‌, మహ్మద్‌, విఎం.గోపాల్‌, రామాంజి పాల్గొన్నారు.