- ప్రభుత్వం స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
ప్రజాశక్తి-మంగళగిరి : ఎప్పుడు పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం వైసీపీ పాలనలో ఎడారిని తలపిస్తోందని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కృష్టా జలాలు విడుదల చేసి డెల్టా ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కృష్ణా నదీ జలాల నిర్వహరణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. సాగునీటి కాలువల నిర్వహణ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు బలవుతున్నారని తెలిపారు. సకాలంలో కాలువల పూడిక, తూటుకాడ తీయకపోవటం కృష్ణా డెల్టాలో కాలువలు, మురికి కాలువల మరమ్మత్తులకు నిధులు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో చివరి ఆయకట్టుకు నీరందటం లేదని మండిపడ్డారు. నీళ్లు లేక నిజాపట్నం, రేపల్లె, నగరంపాలెం మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు వేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, కళ్ల ముందే పంట ఎండిపోవటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. మరో వైపు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని తెలిపారు.










