Jun 09,2022 18:58
  •  సిఎంకు అచ్చెన్నాయుడు సూచన

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సిఎం వైఎస్‌ జగన్‌కు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సవాల్‌ చేశారు. టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. మూడేళ్లలో వైసిపి నాయకులు ప్రజలను దగా చేశారన్నారు. ఒక్క అవకాశంతో అధికారంలోకి వచ్చి అన్ని రంగాలనూ నాశనం చేశారని ఆరోపించారు. ఏ రంగంలో ఏం సాధించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 30 ఏళ్లు తమదే పాలన అని డాంభికాలు పలికిన జగన్‌కు, వైసిపి ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఓటమి భయం పట్టుకుందన్నారు. వ్యవస్థల్ని వాడుకుని, పోలీసులను తన ఆధీనంలోకి తెచ్చుకొని ఇతర పార్టీలపై దాడులు చేసి గెలవడానికి మున్సిపల్‌, మండల, పంచాయతీ ఎన్నికలు కావన్నారు. గడప గడపకు వైసిపి కార్యక్రమంలో సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోకుండా చంద్రబాబుకు వయసయిపోతుందని మాట్లాడటం సరికాదన్నారు. జగన్‌ రాజకీయాలకు అనర్హుడని, ఒక్కసారి ప్రజలు వైసిపికి ఓట్లు వేసి నష్టపోయారని చెప్పారు. రాష్ట్రంలో వైసిపికి పూర్తి వ్యతిరేకత వచ్చిందని, ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపకపోతే ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు.