ప్రజాశక్తి - నార్పల : మండల కేంద్రంలోని స్థానిక ఎనిమిదో వార్డు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడంతో పోటీలో నిలవడానికి ప్రధాన పార్టీల మద్దతుదారులు పలువురు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఈ ఉపఎన్నిక హౌరాహౌరీగా సాగనున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకెళ్తే గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో అప్పట్లోనే హౌరాహౌరీగా సాగిన 8వ వార్డు ఎన్నికల్లో టిడిపి మద్దతుదారుడు సాయి 20 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. కొద్దిరోజుల తర్వాత సాయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో ఎనిమిదో వార్డుకు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ప్రస్తుతం ఈ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి ప్రధాన పార్టీలైన వైసీపీ, టిడిపి, జనసేన మద్దతుదారులు ఉత్సాహం చూపుతున్నారు. కొందరు ప్రధాన పార్టీల నాయకులు తమ తమ పార్టీల మద్దతుతో ఆత్మహత్య చేసుకున్న సాయి కుటుంబ సభ్యులలోనే ఒకరిని బరిలో దింపాలని అంతర్గతంగా పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. చేజారిన స్థానంలో ఈసారైనా పట్టు నిలుపుకోవాలని చూస్తున్నా వైసిపి పట్టును చేజార్చుకోకూడదనుకుంటున్న టిడిపి ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తున్న జనసేన పార్టీలు ఉన్నాయి. పోటాపోటీగా సాగే ఈ ఉప ఎన్నికలో ఎవరికి విజయం వరిస్తుందో 19వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.










