ప్రజాశక్తి -నార్పల : మండల కేంద్రం అయిన నార్పలలోని స్థానిక బాలికల పాఠశాల ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గహంలో బుధవారం సైబర్ క్రైమ్- బాల్య వివాహాలు, ర్యాగింగ్ వేధింపులు తదితర సమస్యలపై ఎస్సై రాఘవరెడ్డి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ఎవరైనా గ్రామాల్లో ఆడపిల్లలకు 18 సంవత్సరాల లోపు, మగ పిల్లలకు 21 సంవత్సరాల లోపు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని చదువుకునే పిల్లలకు ఎవరైనా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే చైల్డ్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు. అదేవిధంగా ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు కూడా అధికమయ్యాయని ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి మీ ఆధార్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అడుగుతే చెప్పకూడదని, అలా చెబితే ఖాతాల్లో ఉన్న డబ్బులు మొత్తం మాయం చేస్తారని దీనిపైన ప్రతి ఒక్కరు అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పించాలని అన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎటువంటి సమాచారం అయినా సమీపంలోని బ్యాంకులకు స్వయంగా వెళ్లి దానికి సంబంధిత అధికారులతోనే తెలుసుకోవాలని ఫోన్లలో ఎటువంటి సమాచారం తెలపకూడదని విద్యార్థినీలు పాఠశాలలకు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు ఎవరైనా వేధింపులకు పాల్పడితే 100 కాల్ చేయాలని అన్నారు. బాల్య వివాహాలు జరుగుతుంటే.. తక్షణమే 1938 చైల్డ్ లైన్ నెంబర్‌కి ఫోన్ చేయాలని తెలిపారు.










