Jun 20,2023 16:39

ప్రజాశక్తి-ఆత్మకూరు(అనంతపురం) : 2022లో ఖరీఫ్‌, రబీలో పంటలు నష్టపోయిన రైతులకు పంట బీమా ఇవ్వాలని, రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఆత్మకూరు మండలం వడ్డిపల్లి రైతు భరోసా కేంద్రం ఎంపిఓకి సిపిఎం నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. 2022లో ఖరీఫ్‌, రబీలో దెబ్బతిన్న వేరుశనగ, పత్తి, మిరప, కంది పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పులు చేసి పంటలు సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రాకుండా పోవడంతో రైతులు అనేక కష్టలు పడుతున్నారన్నారు. 2019లో 26 మంది,2020లో 67 మంది, 2021లో 44 మంది, 2022లో 22 మంది, 2023లో ఇప్పటివరకు 20 మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఖరీఫ్‌ 2022లో వేరుశెనగ రెండు లక్షల హెక్టర్లులలో, పత్తి 77 వేల హెక్టార్లలో, మిరప 27 వేల హెక్టార్లులో దెబ్బతిన్నాయని.. పండ్లు తోటలు చీనీ, అరటి, దానిమ్మ పంటలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు అందుబాటులో ఉండాలని, నాసిక రకం విత్తనాలు అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రతి రైతుకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం ఎం.రామయ్య లక్ష్మన్న ఓబులపతి జయరాం, దివాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.