Jun 28,2023 21:39
  •  నల్లమడ రైతు సంఘం, గుంటూరు చానల్‌ సాధన కమిటీ

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకూ పొడిగించకుంటే ప్రజా ఉద్యమం తప్పదని రైతు, ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. గుంటూరు ఛానల్‌ విస్తరణ చేయాలని నల్లమడ రైతు సంఘం, గుంటూరు చానల్‌ సాధన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ విస్తరణ ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు, పర్చూరు మండలాల ప్రజల కలని అన్నారు. ఎనిమిదిన్నర దశాబ్దాలుగా పాలక పార్టీల నిర్లక్ష్యంతో వేలాది మంది రైతులు కడగండ్ల బారిన పడుతున్నారని తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.270 కోట్లు నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఎంతోమంది నేతలు గుంటూరు ఛానల్‌ విస్తరణకు పోరాటాలు నడిపారని, ప్రభుత్వం ఈసారైనా నిధులు విడుదల చేయకుంటే మరో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మద్దతు పలికారు. సంక్షేమ పథకాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోన్న ప్రభుత్వం 50 గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించటానికి ఉపయోగపడే ఛానల్‌ విస్తరణకు రూ.300 కోట్లు ఖర్చు చేయటానికి చేతులు రావట్లేదన్నారు. తక్షణమే భూసేకరణకు నిధులు విడుదల చేసి, ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాలని కోరారు. దీక్షల్లో గుంటూరు ఛానల్‌ సాధన కమిటీ నాయకులు యార్లగడ్డ అంకమ్మ చౌదరి, జాస్తి వీరయ్య చౌదరి, రామినేని సురేష్‌, బండి నాగేశ్వరరావు, కంచుమాటి అజరుకుమార్‌, కొల్లా చిట్టెమ్మ, గొల్లపూడి శారద తదితరులు పాల్గొన్నారు.