Jun 29,2023 08:39
  •  జీడి పిక్కల ధరలు పతనం
  •  చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం
  •  నైరాశ్యంలో జీడి రైతాంగం

ప్రజాశక్తి - కవిటి (శ్రీకాకుళం జిల్లా) : జీడిపిక్కలకు మద్దతు ధరపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.10 వేలు ధర కల్పించి రైతులకు అండగా ఉంటామని చెప్పిన అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి సీదిరి అప్పలరాజు మాటలు నీటిమూటలయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా మంత్రి ఇచ్చిన హామీ అమలు కాకపోగా, ఐదేళ్ల కిందట రూ.14వేలు పలికిన జీడి పిక్కల బస్తా నేడు రూ.ఏడు వేలకు పడిపోయింది. దీంతో ఎకరాకు సుమారు రూ.30వేలు పెట్టుబడి పెట్టి పంట పండించిన జీడి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరోవైపు పరిశ్రమల బంద్‌ పేరుతో జీడి వ్యాపారులు సరికొత్త డ్రామాకు తెరతీశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోంది.
పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి, సోంపేట ఉద్దానం ప్రాంతాలతో పాటు జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో జీడి పంట సాగవుతోంది. ఈ పంటే జీవనాధారంగా సుమారు 80 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తిత్లీ తుపాను జీడి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. తుపానుకు ఎక్కడికక్కడ నేలకొరిగిన చెట్లు తొలగించేందుకు పెట్టుబడులు పెట్టగా, మరోవైపు ఉన్న చెట్ల దిగుబడి పూర్తిగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పాడైన చెట్ల స్థానంలో కొత్త జీడి మొక్కలను పెంచుతున్నారు. మూడేళ్లుగా దిగుబడులు తగ్గి తీవ్ర నష్టాలు చవిచూసిన రైతులకు ఈ ఏడాది జీడి పిక్కల దిగుబడి పెరగడంతో అప్పుల ఊబి నుంచి ఎంతోకొంత గట్టెక్కవచ్చని సంతోషించారు. జీడి పిక్కలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆ ఆనందం వారిలో ఆవిరైంది. ఇటీవలి కాలంలో 80 కేజీల జీడి పిక్కల బస్తా రూ.ఎనిమిది వేలు ఉండగా, జీడిపిక్కలు పంట వచ్చేసరికి ఒక్కసారిగా ఆ ధర రూ.7 వేల నుంచి రూ.8 వేలకు పడిపోయింది. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
గిట్టుబాటు ధర రాకపోగా, మరీ అంత తక్కువ ధరకు అమ్ముకోలేక ఇళ్లల్లోనే జీడి పిక్కల బస్తాలను ఉంచారు. కొందరు రైతులు చేసిన అప్పుల వడ్డీలు కట్టేందుకు, ఇతర కుటుంబ అవసరాలకు తప్పనిసరి పరిస్థితుల్లో బస్తాను రూ.ఐదు వేల నుంచి రూ.ఆరు వేల వరకు తెగనమ్ముకున్నారు. గతేడాది కన్నా ధర పెరుగుతుందని భావిస్తే, అంతకంటే తగ్గడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.తొమ్మిది వేలు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం నుంచి అదనంగా రూ.వెయ్యి చెల్లిస్తామని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గతంలో హామీనిచ్చారు. ఆ హామీ నేటికీ నెరవేరకపోగా, ఉన్న ధర కూడా పతనమవుతున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.

  • స్థానిక రైతులకు మొండిచేయి

విదేశాల నుంచి వచ్చే లగ్జరీ కార్లు తదితర వాటిపై శత శాతం పన్ను విధించి స్థానిక కార్పొరేట్లకు ప్రోత్సాహం ఇచ్చే కేంద్ర ప్రభుత్వం, జీడి రైతుల విషయానికొచ్చేసరికి ఉదాసీన వైఖరి అవలంభిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే జీడిపిక్కలు, జీడిపప్పుపై 2.5 శాతం మాత్రమే పన్ను విధిస్తుండడంతో స్థానిక వ్యాపారులు విదేశీ పిక్కలను దిగుమతి చేసుకుంటున్నారు. ఉద్దానంలో పండిన జీడిపిక్కలను తూతూమంత్రంగా కొనుగోలు చేసి రైతులకు ఎంతో కొంత చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం టన్నుల కొద్దీ వాడే జీడిపప్పును విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ స్థానిక రైతులకు మొండిచేయి చూపిస్తోంది.

  • ధర ఎగ్గొట్టేందుకు డ్రామాలు

మరోవైపు వ్యాపారులు సరికొత్త డ్రామాకు తెరతీశారు. జీడిపప్పు విక్రయాల్లేకపోవడంతో ధర పడిపోయిందని, నిల్వలు పేరుకుపోయాయని చెప్తూ జులై ఐదో తేదీ నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు పరిశ్రమల బంద్‌కు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తాము రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయలేమని చెప్తున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన ధర లేకపోవడంతో నిర్వేదంలో కూరుకుపోతున్నాడు జీడి రైతు. ఇప్పటివరకు తమ వద్ద కొన్న జీడిపిక్కల ద్వారా ఉత్పత్తి చేసిన పప్పును పలు గ్రేడ్‌లు చేసి కేజీ రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు అమ్మిన వ్యాపారులు తమకు మాత్రం 80 కేజీల బస్తాకు రూ.ఎనిమిది వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. వ్యాపారులు జీడిపప్పు రేటు తగ్గిందని చెప్తున్నా, మార్కెట్‌లో కేజీ రూ.600కి తగ్గడం లేదని, నాసిరకం పప్పు రేటును నాణ్యమైన పప్పుకు అన్వయించి వ్యాపారులు ధర తగ్గిందని గగ్గోలు పెడుతున్నారని చెప్తున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఎంతోకొంతకు తెగనమ్ముకున్న తర్వాత జీడిపప్పు ధర అమాంతం పెరుగుతుందన్నది బహిరంగ రహస్యమేనని చెప్తున్నారు.

  • స్పందించని పార్టీలు

సుమారు 40 రోజులుగా రైతులు, రైతుసంఘాలు జీడిపిక్కల మద్దతు ధర కోసం పోరాడుతుంటే వామపక్షాలు తప్ప మిగతా రాజకీయ పార్టీలు రైతుల గోడును వినిపించుకున్న దాఖలాల్లేవు. అధికార పార్టీ ఇచ్చిన హామీనే అమలు చేయలేదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రశ్నించేందుకు వచ్చామని చెప్తున్న జనసేన జీడి రైతుల తరుపున ప్రశ్నించిన దాఖలాలే లేవు.