- న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్ : ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో కావేరి జాదు పత్తి విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు ఆందోళన బాట పట్టారు. తమకు సీడ్‌యాక్ట్ ప్రకారం ఎకరాకు రూ.23,370 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.. కంపెనీపై క్రిమినల్ కేసులు పెట్టాలని నినదించారు. ధర్నానుద్దేశించి ఎపి రైతు సంఘం కర్నూలు, నంద్యాల జిల్లా కార్యదర్శులు జి.రామకృష్ణ, ఎ.రాజశేఖర్ మాట్లాడారు. బాధిత రైతులకు ప్రభుత్వం అవార్డు ప్రకటించి ఏడు నెలలు గడుస్తున్నా..నేటికీ నష్ట పరిహారం చెల్లించలేదన్నారు. కావేరి యాజమాన్యం హైకోర్టులో స్టే పొంది రైతులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని కావేరి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీ లైసెన్సును రద్దు చేయాలని కోరారు. కావేరి జాదు వల్ల జిల్లాల్లో 1889 మంది రైతులు మాత్రమే నష్టపోయినట్లు అధికారులు గుర్తించారన్నారు. గుర్తించని రైతులు వేలాదిమంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి రైతు సంఘం ప్రతినిధులు తీసుకువెళ్లారు. ఇప్పటికే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా అవార్డు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు. అందరికీ న్యాయం జరిగేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు. బాధిత రైతులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.










