- ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : ప్రభుత్వం ఏ పేరు పెట్టినా కంట్రిబ్యూషన్ లేని పెన్షనే మా డిమాండ్ అని ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళంలోని ఎన్‌జిఒ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సిపిఎస్ రద్దు పోరాటం నుంచి వెనక్కి వెళ్లలేదని, ఒపిఎస్ కోసం పోరాడుతామని తెలిపారు. ప్రభుత్వం నుంచి రెండు డిఎలు రావాల్సి ఉందని, విజయవాడలో నిర్వహించనున్న కౌన్సిల్ సమావేశం నాటికి కనీసం ఒక డిఎ అయినా ప్రకటిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నియమించిన 12వ పిఆర్‌సి సిఫార్సులు వచ్చేటప్పటికి ఏడాది కాలం పట్టే అవకాశం ఉన్నందున ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా పరిగణించి వారికి సంక్షేమ పథకాలు తొలగిస్తున్నారని, వారికి పిఆర్‌సి కంటే ముందుగానే జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగులు పొందుతున్న మాదిరిగా వేతనాలు చెల్లించాలని కోరారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.శివారెడ్డి మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశాల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగులతో పాటు గెజిటెడ్ ఉద్యోగులను అసోసియేషన్‌లో సభ్యులుగా చేర్చుకునేలా బైలాలో సవరణలు చేస్తామని తెలిపారు. అసోసియేషన్‌లో పలు స్థాయిల్లో మహిళలకు ఉపాధ్యక్ష పదవి కేటాయించేలా మరో సవరణ చేస్తామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు, జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం తదితరులు పాల్గొన్నారు.










