Aug 21,2023 21:16
  • వైద్యశాఖలో మహిళా ఉద్యోగులకు 5రోజులు అడిషనల్‌ క్యాజువల్‌ లీవ్‌లు
  • ఎపి ఎన్‌జిఓ 21వ మహాసభలో సిఎం వైఎస్‌ జగన్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జిపిఎస్‌ (గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌) అమలు కోసం ఆర్డినెన్స్‌ను జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో ఎపి నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ 21వ రాష్ట్ర మహాసభ అసోసియేషన్‌ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సభలో సిఎం మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లోనే జిపిఎస్‌ ఆర్డినెన్స్‌ జారీ అవుతుందన్నారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ఫ్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఎ ఇవ్వనున్నట్లు చెప్పారు. రెండు డిఎలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో జులై 2022వ సంవత్సరానికి సంబంధించిన డిఎను విడుదల చేస్తామని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు, మిగిలిన శాఖల్లో అమలవుతున్న విధంగా ఐదు రోజులు అదనపు క్యాజువల్‌ లీవ్‌లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పెన్షన్‌ విషయాన్ని ప్రస్తావించిన ఆయన సిపిఎస్‌ సమస్యను పరిష్కరించేందుకు ఎంతో మనసు పెట్టి నిజాయితీగా కృషి చేసినట్లు చెప్పారు. ఏడాదిన్నర సమయం అనేక అధ్యయనాలు చేసిన తర్వాత, శాశ్వత పరిష్కారం చూపాలని ఫ్రెండ్లీ గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ను తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వం మీద అధిక బరువు పడకుండా, భవిష్యత్తులో ప్రభుత్వాలు చేతులెత్తే పరిస్థితులు రాకుండా ఉండేలా రూపొందించినట్లు చెప్పారు. మాట తప్పే ఉద్ధేశ్యముంటే అమలు చేయడం సాధ్యం కాదని చెప్పి తప్పించుకునే వాళ్లమన్నారు. రాబోయే రోజుల్లో దేశం మొత్తం మీద ఇదే విధానం అమలు చేస్తారన్నారు. . స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు మన రాష్ట్రంలో 3.97లక్షల మంది ఉండగా, 2019 నుంచి తమ నాలుగున్నరేళ్ల పాలనలో 2,06,638 లక్షలమందికి శాశ్వత ఉద్యోగాలిచ్చామన్నారు. ప్రభుత్వ డెలివరి సిస్టమ్‌లో బలపడాలనే ఉద్ధేశ్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులర్‌ చేసే విషయంలో ముందు ఐదు సంవత్సరాలు ఇస్తే సరిపోతుందని అనుకున్నామని, జిల్లా పర్యటనలు మొదలు పెట్టిన తర్వాత వచ్చే వినతుల దృష్ట్యా 2014 వరకు పరిగణలోకి తీసుకుని క్యాబినెట్‌లో పెట్టి వారిని రెగ్యులర్‌ చేసినట్లు తెలిపారు. ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచామన్నారు. కోవిడ్‌ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయినా ఉద్యోగులకు వేతనాలు, పేదలకు డిబిటి ద్వారా సంక్షేమ పథకాలు అందించామని సిఎం తెలిపారు. ఎపి ఎన్‌జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేసిన ఘనత సిఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. అన్ని జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులకు సమానంగా 16శాతం హెచ్‌ఆర్‌ఎ తీసుకొచ్చారన్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను రూపొందించడంతో పాటు ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు డిఎలను ఇవ్వాలని, వైద్య ఆరోగ్యశాఖలోని మహిళా ఉద్యోగులకు ఐదు రోజులు అడిషనల్‌ సెలవులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందైనా ఐఆర్‌ ప్రకటిస్తారనే నమ్మకం ఉద్యోగుల్లో ఉందని, జిపిఎస్‌ విధానానికి తాము ఆమోదం తెలిపినప్పటికీ కాంట్రిబ్యూషన్‌ లేని పెన్షన్‌ విధానాన్ని ఉద్యోగులు కోరుకుంటున్నట్లు బండి వెల్లడించారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా ఎంతో కొంత జీతాలు పెంచాలని సిఎంకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ఱారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కోవిడ్‌ సమయంలో ప్రభుత్వ పధకాలు ప్రజలకు అందించడంలో ఉద్యోగులు ఎంతో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చంద్రశేఖర్‌రెడ్డి (ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం), మంత్రులు ఆదిమూలపు సురేష్‌, తానేటి వనిత, విజయవాడ సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు వైసిపి ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎపి ఎన్‌జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి శివారెడ్డి తోపాటు పలువురు యూనియన్‌ నేతలు పాల్గొన్నారు.