Jun 29,2023 09:04
  •  హయ్యర్‌ పెన్షన్‌ నమోదుకు అవకాశం
  •  రూ.25 వేల పెన్షన్‌ ధ్రువీకరణ పత్రాన్ని అందించిన
  •  ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులకు సుప్రీం కోర్టు ఆదేశాలతో హయ్యర్‌ పెన్షన్‌ నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతంలో కార్పొరేషన్‌లో వున్నప్పుడు గానీ, ప్రభుత్వంలో విలీనం అయ్యాక గానీ ఆర్‌టిసి ఉద్యోగులకు పెన్షన్‌ కేవలం నామమాత్రంగా రూ.5 వేలకు మించి రాకపోవడంతో ఆర్‌టిసి ఉద్యోగులు రిటైర్డు అయ్యాక తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ నేపథ్యంలో ఆర్‌టిసిలోని ఉద్యోగ సంఘాలు పెన్షన్‌ సమస్యను పరిష్కరించాలని అనేక సందర్భాల్లో ఆందోళనలు చేశాయి. 2022 నవంబరు 4న సర్వీసులో వున్న ప్రతి ఉద్యోగికీ హయ్యర్‌ పెన్షన్‌కు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులకు హయ్యర్‌ పెన్షన్‌ స్కీమ్‌కు ప్రభుత్వం ఒకే చెప్పింది. ఈ స్కీమ్‌లోకి రావడంతో గతంలో కేవలం రూ.5 వేలు వచ్చే పెన్షన్‌ ఇప్పుడు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వచ్చే అవకాశం వుంది. బుధవారం ఎపిఎస్‌ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు ఆర్‌టిసి ప్రధాన కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంటుగా పనిచేస్తున్న సత్యనారాయణకు నెలకు రూ.25 వేల వరకూ పెన్షన్‌ వచ్చేలా హయ్యర్‌ పెన్షన్‌ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఆర్‌టిసిలో ప్రతి ఉద్యోగీ ఈ హయ్యర్‌ పెన్షన్‌ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్‌డి సూచించారు. దేశంలో ఏ ఇతర ఆర్‌టిసి ఉద్యోగులకూ లేని ఈ అవకాశాన్ని ఎపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులకు కలగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అరుణాచలం ప్రత్యేక సర్వీసులతో రూ.3.50 కోట్ల ఆదాయం
రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి అరుణాచలంకు నడిపిన ప్రత్యేక సర్వీసులతో ఎపిఎస్‌ఆర్‌టిసికి రూ.3.5 కోట్ల ఆదాయం వచ్చిందని ఎపిఎస్‌ఆర్‌టిసి ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ నడిపిన 483 సర్వీసుల ద్వారా ఈ ఆదాయాన్ని సముపార్జించినట్లు పేర్కొంది.