ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : జగనన్న మహిళా మార్ట్‌లు, డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకాలకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఆర్.కె.రోజా తెలిపారు. నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా కార్యాలయంలో అర్బన్ మార్కెట్ ప్రారంభోత్సవం, బ్యాంక్ లింకేజీతో వడ్డీలేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఆర్.కె.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలో మహిళల స్వయం ఉపాధి కల్పించేందుకు, మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ఎన్నో వినూత్న మైన ఆలోచనలనుఆవిష్కరిస్తున్నామని, అందులో ఈ ఆహా క్యాంటీన్లు, జగనన్న మహిళా మార్ట్‌లు, డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకాల కేంద్రాలు చాలా కీలకమైనవని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న డ్వాక్రా మహిళలకు వారిలో ఉన్న నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని గుర్తించి, వారికి ప్రభుత్వమే సహకారాన్ని అందించి వారి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. డ్వాక్రా మహిళలకు ఎస్ హెచ్ ఈ బ్యాంక్ లింకేజి కింద్ర ఒక్కొక్క గ్రూపుకు 20లక్షల రూపాయలు అలాగే ''జగనన్న తోడు'' కింద గతంలో ఒక్కొక్కరికి రూ.10వేల ఇవ్వగా ఇప్పుడు 13వేలు ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిదంగా ''పిఎం స్వనిధి'' కింద గతంలో 10వేలు, తర్వాత 20వేలు, ఇప్పుడు 50వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతోందన్నారు. సొంతంగా షాపులు, వ్యాపారాలు చేయాలనుకొనే మహిళలకు ''ముద్రా'' లోన్లు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాలు అందించి ఆదుకోవడం జరుగుతోందన్నారు. మహిళా మార్ట్ లను కూడా రిలయన్స్, హెరిటేజ్, బిగ్ బజార్ వంటి కార్పొరేట్ సూపర్ మార్కెట్‌లకు ధీటుగా జగనన్న మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నారని, వీటి వలన వ్యాపారభివృద్ధి చెంది మహిళల ఆదాయం మరింత రెట్టింపు అవుతుందని వివరించారు. డ్వాక్రా మహిళల ఉపాధి కోసం కార్పొరేట్ రిటైల్ సంస్థలతో టై అప్ అవ్వడం, అమూల్ తో ఒప్పందం చేసుకోవడం, వారికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి సహకారం అందించడం ఈ దేశంలో ఏ ప్రభుత్వం అదించనంత చేయూతని జగనన్న ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, సున్నా వడ్డీ రుణాలతో ఈ రాష్ట్రంలో పేదింటి మహిళలకు స్వయం ఉపాధికి జగనన్న తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. గతంలో చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని మోసగిస్తే, జగనన్న మాత్రం చెప్పిన మాట ప్రకారం నాలుగు విడతలగా పూర్తిగా మాఫీ చేసి చూపించారని కొనియాడారు. ఒక్క వైఎస్సార్ ఆసరానే కాదు.. సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేస్తూ, అత్యధికంగా రికార్డ్ స్థాయిలో రుణాలు ఇప్పిస్తూ డ్వాక్రా మహిళల తలరాతలను మార్చిన నాయకుడు జగనన్న అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఏ హరి, వైస్ చైర్మన్లు డి.జయ ప్రకాష్, డి శంకర్, కౌన్సిలర్లు, రాష్ట్ర డైరెక్టర్లు, కమిటీ చైర్మన్లు జిల్లా, మెప్మా అధికారి , మునిసిపల్ కమీషనర్ కేఎల్‌ఎం ఎన్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.











