ప్రజాశక్తి - భవానీపురం (విజయవాడ) : జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు బేషుగ్గా ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహరాలు, ప్రజా పంపిణీ శాఖ డైరెక్టర్ కెఎంఎస్ ఖల్సా అన్నారు. కార్డుదారులకు పారదర్శకంగా సకాలంలో నాణ్యమైన రేషన్ బియ్యాన్ని మొబైల్ వాహనాల ద్వారా పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. విజయవాడ భవానీపురంలోని 15వ, 17వ నెంబర్, సింగనగర్లతో పాటు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి, గుంటుపల్లిల్లో రేషన్ దుకాణాలను, మొబైల్ బియ్యం పంపిణీ వాహనాలను, గుంటుపల్లి హైస్కుల్లోని మధ్యాహ్న భోజన పథకాన్ని ఎన్‌టిఆర్ జిల్లా పౌరసరఫరాల అధికారులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఖల్సా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పారదర్శకంగా లబ్ధిదారుల గడపవద్దకే రేషన్ బియ్యం అందించడం అభినందనీయమన్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ విధానాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. రేషన్ దుకాణాల్లో బియ్యం, పంచదారతోపాటు గోధుమలు, గోదుమ పిండి, కందిపప్పు, చింతపండు, వంట నూనెలు సరఫరా చేయాలని కార్డుదారులు కోరిన విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనం పథకానికి అందించే బియ్యం నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టిఆర్ జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలిపద్మ, పౌరసరఫరాల సిబ్బంది పాల్గొన్నారు.










