రావికమతం (అనకాపల్లి) : 5 గిరిజన గ్రామాలకు ప్రభుత్వం నుండి అందాల్సిన రేషన్ బియ్యం గత 3 నెలలుగా అందడం లేదు.. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు.. తూతూమంత్రంగా ప్రభుత్వాధికారులు సర్వే కోసం వచ్చి వెళ్లిపోయారు.. గిరిజనుల కళ్ల ముందే వారికియ్యాల్సిన రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్లు, బండి యజమానులు కుమ్మక్కయ్యి ఆ బియ్యాన్ని ప్రైవేటు వారికి ధర కట్టి అమ్ముతున్నారు. ఇదేం ... అన్యాయం ..! రెక్కాడితేనే గాని డొక్కాడని మాకు రేషన్ బియ్యం ఇవ్వకపోతే ఎలా ? అని అడుగుతుంటే.. బియ్యాన్ని కొనుక్కున్న ప్రైవేటు వారి వద్ద కొనుక్కోమంటున్నారు. గత్యంతరం లేని స్థితిలో ఆ 5 గిరిజన గ్రామ ప్రజలంతా వారివారి గొర్రెలను, మేకలను ప్రైవేటు వారికి అమ్మి రేషన్ బియ్యాన్ని కొంటున్నారు..!

ఆందోళన చేస్తే .. ఎంక్వయిరీకొచ్చారు.. ఫలితం రాలేదు : సిపిఎం జిల్లా కార్మిక సభ్యుడు కే.గోవిందరావు
సిపిఎం జిల్లా కార్మిక సభ్యుడు కే.గోవిందరావు మాట్లాడుతూ అక్కడి పరిస్థితిని వివరించారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో జిసిసి రేషన్ డిపో నెంబర్ 24 లో కడగడ్డ, నేరేడు బంద, జడ్.జోగంపేట, రోచ్చిపోనుకో, తాటిపర్తి గ్రామాల్లో 300 రేషన్ కార్డులకు గత మూడు నెలల నుండి బియ్యం అందడం లేదు. గత సంవత్సరం నవంబర్, డిసెంబర్ నుండి ప్రధానమంత్రి గరీబ్ యోజన బియ్యం పథకం కూడా అందలేదని, ఆందోళన చేయడం ఫలితంగా. రావికమతం ఎంఆర్‌ఓ సివిల్ సప్లై ఆర్‌ఐ గత మూడు రోజులు క్రితం ఎంక్వయిరీ చేసి వెళ్లిపోయారు కానీ ఏ ఫలితం లేదని చెప్పారు.
తప్పుడు రిపోర్టులతో గిరిజనుల నోట్లో మట్టి కొడుతున్నారు...
వాస్తవానికి మూడు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వలేదని గిరిజనులు చెప్పగా, అధికారులు మాత్రం ఒక నెల బియ్యం మాత్రమే ఇవ్వలేనట్టుగా రికార్డ్ తయారు చేసి జిల్లా అధికారులకు తప్పుడు రిపోర్టు పంపారు. ఆ రిపోర్టు పంపిన అధికారులపై చర్య తీసుకోవాలని, మూడు నెలలు రావల్సిన బియ్యం వెంటనే ఇవ్వాలని, భూములేని ఆదివాసి గిరిజనులు రెక్క ఆడితే గాని డొక్కాడని గిరిజన జీవితాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని నేత కే.గోవిందరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మూడు నెలల నుండి బియ్యం ఇవ్వలేదని రెవెన్యూ అధికారులకు గిరిజనులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రైవేటు వ్యాపారస్తుల నుండి కేజీ 20 రూపాయలు లెక్కగట్టి గిరిజనులకు ఇవ్వాల్సిన బియ్యాన్ని అమ్ముతున్నారని తెలిపారు. తమ వద్ద ఉన్న గొర్రెలు, మేకలను అమ్ముకొని ప్రైవేటువారి వద్ద బియ్యం కొనుక్కోవల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఇంటి వద్ద రేషన్ ఇస్తామని చెబుతుంది.. కానీ రేషన్ డీలర్, రేషన్ బండి యజమాని ఇద్దరూ కుమ్మక్కయి గిరిజన నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు దర్యాప్తు చేసినప్పటికీ ఒక నెల బియ్యం కూడా ఇప్పటివరకు తమకు ఇవ్వలేదని తెలిపారు. తప్పుడు రిపోర్ట్ చేసిన అధికారులపై చర్య తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్మిక సభ్యుడు కే.గోవిందరావు, గ్రామస్తుల గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో గిరిజన సంఘం నాయకులు ఉల్లి రాజబాబు, ఉల్లి సోమరాజు, టేకు రవి, ఉల్లి రాజులమ్మ, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.










