Oct 05,2023 15:32

కమ్మర్‌ పల్లి :మండలంలోని బషీరాబాద్‌ గ్రామానికి చెందిన ఆరుగురు అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి విడుదల చేసిన ఎంపిక జాబితాలో ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన ఆరుగురు అభ్యర్థుల్లో సివిల్‌ కానిస్టేబుల్‌ లుగా కూర్మ అభినవ్‌, వంజరి అంజు ఉద్యోగాలు సాధించగా, ఏఆర్‌ కానిస్టేబుల్‌ లుగా నాగుల వినిత్‌, పాతని నితిన్‌, కుర్మా ప్రణరు ఉద్యోగాలు సాధించారు. కాగా కూర్మ గణేష్‌ బెటాలియన్‌ సాధించాడు. గ్రామం నుండి ఒకేసారి ఆరుగురు అభ్యర్థులు పోలీస్‌ ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోలీస్‌ కానిస్టేబుళ్లుగా ఎంపికైన ఆరుగురు అభ్యర్థులను సర్పంచ్‌ సక్కారం అశోక్‌ ఘనంగా సన్మానించారు. శాలువాలతో సత్కరించి, అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన యువత పోలీస్‌ కోలుల సాధించడం ఆనందంగా ఉందన్నారు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి, ఉత్తమ సేవలు అందించడం ద్వారా గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు.జీవితంలో మంచిగా పదోన్నతులు పొంది ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ కస్తూరి విక్రమ్‌, టిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులు బైకాని మహేష్‌, నాయకులు రమేష్‌, నారాయణ, రాజు, బాశెట్టి గంగాధర్‌, బందెల రాజు, మురళి, కొత్తూర్‌ మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.