May 13,2023 22:37
  • తుళ్లూరులో రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
  • జడ శ్రావణ్‌కుమార్‌ సహా పలువురు అరెస్టు

ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా) : రాజధాని అమరావతిలో రెండవ రోజూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్‌-5 జోన్‌ను వ్యతిరేకిస్తూ జైభీమ్‌ పార్టీ వ్యవస్థాపకుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ శనివారం తుళ్లూరు రైతు దీక్షా శిబిరం నుంచి శాఖమూరులోని బిఆర్‌ అంబేద్కర్‌ స్మఅతివనం వరకు పాదయాత్రకు పిలుపునిచ్చారు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు అంబేద్కర్‌ స్మృతివనం వద్దకు రైతులు బయల్దేరగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీక్షా శిబిరం నుంచి రైతులు, మహిళలు, రైతు కూలీలను బయటకు రాకుండా అడ్డుగా నిలబడ్డారు. ఉదయం 7 గంటలకే భారీగా మోహరించిన పోలీసులు రైతు దీక్షా శిబిరం వద్ద తాళ్లను అడ్డుగా పెట్టి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో కొంతమంది మహిళా రైతులు కింద పడిపోయారు. రైతులు కాటా అప్పారావు, పులి చిన్నా మరికొందరు పాదయాత్రను ఆపవద్దని పోలీసులను వేడుకున్నారు. అయినప్పటికీ వారు అడ్డుతొలగకపోవడంతో సహనం కోల్పోయిన రైతులు, మహిళలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి నేలపై కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం దాదాపు 60 మంది రైతులు, మహిళలు, వృద్ధులు పొలాల్లో నుంచి ముళ్ల కంపలను తొలగించుకుంటూ మండుటెండలో స్మృతివనం వద్దకు చేరుకున్నారు. పాదయాత్రలో పాల్గనేందుకు వస్తున్న జడ శ్రావణ్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడలోని నున్న పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసు స్టేషన్‌లో ఉన్న ఆయనను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఫోన్‌లోనూ, రాష్ట్ర కమిటీ సభ్యులు అండ్ర మాల్యాద్రి, సూర్యారావు స్టేషన్‌కు వెళ్లి పరామర్శించారు. మరోవైపు రాజధానిలో పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ చేసినందుకు కృతజ్ఞతగా వైసిపి నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించడానికి సిద్ధపడ్డారు. దీంతో, వైసిపి నాయకుడు ఎస్‌ సందీప్‌తోపాటు మరికొందరిని పోలీసులు గఅహ నిర్భంధంలో ఉంచారు.

  • దొండపాడులో జంగిల్‌ క్లియరెన్స్‌ను అడ్డుకున్న రైతులు

రాజధానిలోని దొండపాడులో శనివారం జంగిల్‌ క్లియరెన్స్‌, భూమి చదును చేయడాన్ని రైతులు అడ్డుకున్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడకుండా హడావిడిగా ఇళ్ల స్థలాల పంపిణీ ఎందుకని అధికారులను నిలదీశారు. జంగిల్‌ క్లియరెన్స్‌ ఆపేవరకు కదిలేది లేదని చెప్పడంతో పోలీసులు కొంత మందిరైతులను అదుపులోకి తీసుకొని తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వారిని విడుదల చేశారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై రైతులకు చెందిన టెంట్‌ను తొలగించారు. అనంతరం పోలీసు బలగాల మధ్య జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు కొనసాగాయి. నిడమర్రు, కఅష్ణాయపాలెంలో మట్టిని భూమిని చదును చేశారు.