కదిరి : రక్షణగా ఉండాల్సిన పోలీసులే ఓ యువతి పట్ల అసభ్య ప్రవర్తనకు పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం చుక్కర్ల కొట్టడంతో పోలీసు శాఖ అప్రమత్తం అయ్యింది. కేసుకు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. కాగ ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని మీడియాకు తెలియజేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... కదిరి పట్టణానికి చెందిన ఓ యువతి ఆదివారం రాత్రి మందులు కొనుగోలు చేసేందుకు పట్టణంలోని మొడికల్ స్టోర్ వద్దకు వెళ్లింది. ఈ సమయంలో అక్కడున్న ఓ హోంగార్డు యువతిని విచారణ పేరుతో అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో భయపడిన యువతి అక్కడి నుంచి ఇంటికి వెళ్లి, జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యలకు తెలిపింది. ఈ విషయం సోమవారం నాడు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యింది. పోలీసులే ఇలా యువతిపై అసభ్యంగా ప్రవర్తించారంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులూ సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు.
విచారణ చేస్తున్నాం...
సిఐ తమ్మిశెట్టి మధు
యువతిపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారన్న విషయంపై విచారణ చేస్తున్నామని పట్టణ సిఐ తమ్మిశెట్టి మధు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది యువతి పట్ల అసభ్యకరంగా వ్యవహరించి ఇబ్బంది పెట్టినట్లు సమాచారం అందిందన్నారు. దీనిపై ఎస్‌ఐ ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్‌ను యువతి నివాసానికి పంపి విచారించామన్నారు. యువత తెలిపిన వివరాల మేరకు తదుపరి విచారణ కొనసాగిస్తామని పేర్కొన్నారు.










