Sep 19,2023 12:25

ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌజ్ అరెస్టులు రాజ్యాంగ వ్యతిరేక చర్య అని టీడీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు. చంద్రబాబు నిర్ధోషిగా బయటకు రావాలని దేవాలయాలు, మసీదులు, చర్చల్లో  ప్రార్థించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకోవడం జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబుపై జగన్ రెడ్డి కక్ష కట్టారని అన్నారు. అక్రమ కేసులు బనాయించి జైలు పాల్జేశారని తెలిపారు. శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహించే హక్కు కూడా ప్రజలకు లేదంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు.. అని ప్రశ్నించారు. విజయవాడ, గుంటూరు, ఉభయగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమని అన్నారు. ఇది పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతుందన్నారు.  
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దేనికి సంకేతమని, అధికార పార్టీకి ఒక రూలు ప్రతిపక్షాలకు మరో రూలా అని మండిపడ్డారు. రాష్ట్రమంతా పోలీస్ చట్టం ఉంటే ముఖ్యమంత్రి తిరుపతిలో సభ ఎలా పెట్టారో పోలీసులు సమాధానం చెప్పాలన్నారు.. టీడీపీ నేతలు ఎక్కడైనా విధ్వంసాలకు, చట్ట వ్యతిరేకం కార్యాకలాపాలకు పాల్పడ్డారా.. అని ప్రశ్నించారు. పోలీసులు కూడా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారని అన్నారు. హద్దులు దాటి అణచివేతకు గురిచేస్తున్నారని తెలిపారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, టీడీపీ నేతలను గృహ నిర్భంధాలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.  టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా గృహ నిర్భంధాలపై ఆగ్రహించారు.