Jul 15,2021 17:25

జెనీవా : కరోనా ధర్డ్‌ వేవ్‌ వస్తుందోన్న వార్తల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ముందస్తు హెచ్చరికలు చేసింది. ప్రపంచం మొత్తం మూడవ వేవ్‌ తొలి దశలో ఉన్నట్లు డబ్ల్యుహెచ్‌ఒ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గురువారం తెలిపారు. కరోనా ఆంక్షలు ఎత్తివేయడం, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో మహమ్మారి విజృంభిస్తోందని, కరోనా మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌ కారణంగా ఐరోపా అంతటా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు వ్యతిరేక దిశలో వెళుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వైరస్‌లో పలు మార్పులు చెంది కొత్తకొత్త వేరియంట్లుగా పుట్టుకొస్తుందని అధనామ్‌ అన్నారు. ఇప్పటికే భారత్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్‌ 111 దేశాలకు విస్తరించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.