Apr 20,2023 06:05

మధ్యాహ్న 'బాలుడు' మల్లెపూవు ఛాయ, మల్లెపూవు మీద మంకెన్న పూ ఛాయ అంటూ మా కాంప్లెక్సు లోని ఓ భక్తి ఛానల్‌ నుండి వచ్చే సుమధుర సంగీతం వినిపిస్తోంది. శ్రద్ధగా వినాలే కాని అన్ని మతాల, అందరు దేవుళ్ళ భక్తి ఛానళ్ళూ వినబడతాయి అక్కడ నిలబడితే. ఆహా నిజంగా నా భారతదేశం ఓ సెక్యులర్‌ దేశమే కదా అని మనస్సు పరవళ్ళు తొక్కింది. ఎవరి ప్రార్ధనలు వాళ్ళు చేసుకొమ్మనండి ఎవరికీ అభ్యంతరంలేదు అది వాళ్ళ హక్కు కూడా. ఐతే ఆ భక్తిని దేశం వైపు, దేశంలో రైతులు, కార్మికులు, సామాన్య ప్రజల వైపు, పెరుగుతున్న ధరలవైపు మళ్ళించే దారి మాత్రం ఆ ఛానళ్ళు చూపరు. కావలిస్తే మధ్యలో వ్యాపార ప్రకటనలు ముఖ్యంగా బంగారు ఆభరణాలు, రియల్‌ ఎస్టేటు, రకరకాల బ్రాండ్ల బియ్యం, మినపగుండ్లు, ఆట, నూనెలు, సేమియాలు ఇలాంటివి మస్తు మస్తుగా చూపించి దండుకుంటారు. నెంబర్‌ వన్‌ హీరోనే ఫలానా సేమియాతో టిఫిన్‌ చేసి పెట్టమని చెల్లెలికి చెబుతుంటే వినక ఛస్తామా!!
భానుడు అంటే సూర్యుడు తెల్లారినప్పటి నుండి పొద్దుగూకే వరకు ఎలా ఉంటాడో రాసిన ఆ కవిని మనసులోనే అభినందించాను. ఐతే అది ఎప్పుడు రాశాడో తెలీదు. ఇప్పుడున్న వాతావరణాన్ని చూస్తే అది ఎంతగా మరిపోయిందో ఆ పాట వల్ల తెలిసిపోతుంది. మధ్యాహ్న బాలుడు అన్నారే గాని అందులో, మధ్యాహ్నం సూర్యుడు బాలుడు కాదు, బలిష్టమైన బాక్సింగ్‌ ఆటగాడిలా తన ప్రతాపం చూపుతూ, నిప్పులు కక్కుతూ, మనచేత చెమటలు కక్కించి మరీ పోతాడు. కావాలంటే మా కర్నూలుకు రండి ఎండ ఎలా ఉంటుందో చూపుతాం, ఫ్రీగానేలెండి. అలాగే కొండారెడ్డి బురుజు కూడా చూద్దురు గాని.
ఈ ఎండాకాలంలో సూర్యుడిని ''మొత్తం నీవే చేశావ్‌'' అని ప్రకాశ్‌ రాజ్‌ని బొమ్మరిల్లు సినిమాలో కొడుకు సిద్దార్థ్‌ అన్నట్టు అందరూ తిట్టేవాళ్ళే. నిజంగా మన భూమి సూర్యుడికి దగ్గరగా పోతుంది ఎండా కాలంలో. నిజం చెప్పాలంటే అలా దగ్గరికి పోతున్నందుకే ఎండాకాలం వచ్చింది. అది వేరే సంగతి. ఆ ఎండకు కొందరు ఒడియాలు, అప్పడాలు పెట్టుకుంటుంటే ఇంకొందరు అంటే కోట్లు కలవాళ్ళు సోలార్‌ ఎనర్జీ అంటూ సూర్యుడి నుండి కూడా డబ్బు తీయొచ్చని నిరూపిస్తున్నారు. మంచిదే అలా ఆ సూర్యరశ్మి నుండి విద్యుత్తు తీస్తే. మనకే ఇతర విధాల ఉత్పత్తి చేసే కరెంటుకు తోడ్పడుతుంది. కాలుష్యమూ తగ్గుతుంది. ఐతే ఈ ఎండలెందుకు పెరుగుతున్నాయి, రోడ్ల కోసమని చెట్లు కొట్టేసినందునా, కొండలు పగలేస్తున్నందువల్లనా, ఇష్టమొచ్చినట్టు మన ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నందువల్లనా, అడవులను క్రమంగా తగ్గిస్తున్నందువల్లనా, నదుల్లో ఇసుకను తోడేసుకుంటూ పోతున్నందునా అనుకుంటూ ఆలోచిస్తే ఇంకా ఎన్నో కారణాలు కనిపిస్తాయి. పాపం సూర్యుడికి ఇవన్నీ తెలియవు. తనను తిట్టుకుంటున్నట్టు కూడా ఆ సూర్యనారాయణుడికి తెలియదు. అది వేరే సంగతి. కాని మనకు అంటే మనుషులకు, అంటే ప్రజలకు, నాయకులకు బాగా తెలుసు. అది అసలు సంగతి. ప్రపంచంలో ఎక్కడో ఒకచోట మూడువందల అరవై ఐదు రోజులూ యుద్ధాలు జరుగుతుంటాయి, ఆ యుద్ధంలో ఒకదేశం తయారు చేసిన ఆయుధాలు, విమానాలు, క్షిపణులు వాడుతుంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే రెండువైపులా అవన్నీ సమకూర్చి యుద్ధం చేయిస్తుందా దేశం. మళ్ళీ తానే కాలుష్యం కాలుష్యం అని అరుస్తుంటుంది, దొంగ తానే దొంగా దొంగా అని అరచినట్టు. అసలు ప్రపంచానికి పట్టిన కాలుష్యమే ఆ దేశమని మరవద్దు.
కాబట్టి నాదేశ పెజలారా మీ భక్తి మీకు ఉండనీండి. మీ దేవుడు ఎవరైనా కావచ్చు, అల్లా, జీసస్‌, రాముడు, గురునానక్‌ ఇలా ఎందరైనా కావచ్చు. కానీ నా రాష్ట్రం, నా దేశం, నా ప్రపంచం కూడా మీకు దేవుడి లాంటివే. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, సూర్యుడొచ్చాడా, ఈరోజు ఉష్ణోగ్రత ఎంత అని తెలుసుకొని మళ్ళీ రేపు అంటే మరుసటిరోజు లేయడం కాదు, ఆ రేపటిని కాస్త జాగ్రత్త చేసి మన పిల్లలకి బహుమతిగా ఇచ్చిపోవద్దూ.... ఆలోచించండి. ఉన్నది ఒకటే జిందగీ...అంతే కాదు ఉన్నది ఒకటే దునియా..!


- జంధ్యాల రఘుబాబు,
సెల్‌ : 9849753298