Jul 14,2021 18:24

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎ) వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల ఘటనతో సంబంధం ఉన్న కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు స్థానిక కోర్టు ఢిల్లీ పోలీసులకు చీవాట్లు పెట్టింది. 25 వేల రూపాయలను జరిమానా విధించింది. ఢిల్లీ పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అల్లర్ల బాధితుడు మహ్మద్‌ నజీర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించింది. అల్లర్ల సమయంలో కాల్పుల్లో నజీర్‌కు కంటికి గాయమైంది. దీనికి కారణమైన ఆరుగురిపై నజీర్‌ ఫిర్యాదు చేశారు. అందులో ఒకరు మాజీ బిజెపి ఎమ్మెల్యే నరేష్‌ గౌర్‌. అయితే అల్లర్ల ఘటనతో సంబంధం లేదని ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించడంతో ఆయన మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను సమర్థించిన కోర్టు...ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వును పోలీసులు సెషన్‌ కోర్టులో సవాలు చేశారు. దీనిపై మంగళవారం పూర్తి స్థాయిలో వాదనలు విన్న జడ్జి...పోలీసు చర్య దిగ్భ్రాంతికి గురి చేసిందని, శోఛనీయమని అన్నారు. ' ఢిల్లీ హైకోర్టు నిబంధనల ఆదేశాలను పోలీసులు అనుసరించలేదు. దర్యాప్తు సాధారణంగా చేసేశారు. ఇదంతా వ్యంగ్యంగా జరిగిందని స్పష్టమౌతోంది' అని అన్నారు. దర్యాప్తు చేయకుండా నిందితుడికి క్లీన్‌చిట్‌ ఎలా ఇచ్చారయ్యా అంటూ పోలీసులను కోర్టు ప్రశ్నించింది. ఈ మొత్తం కేసును పరిశీలిస్తే...నిందితులను రక్షించేందుకు పోలీసులు శ్రమించినట్లు కనిపిస్తోందని విమర్శించింది. సరైన పద్దతిలో విచారణ జరపాలని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించింది.