మంగళగిరి : రైతు పాలన, రాజన్నపాలన తీసుకొస్తానని చెప్పి రాజ్యాధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి, తన రెండేళ్ల పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారని, రైతును నడిరోడ్డుపై నిలబెట్టారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనలో రైతులు తీవ్రమైన ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారనేది అక్షరసత్యం అని అన్నారు. రాయలసీమ మొదలు కోస్తా, ఉత్తరాంధ్ర సహా అన్నిప్రాంతాల్లో ఏ గ్రామంలోనూ రైతులు సంతోషంగా లేరని విమర్శించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అరకొర సాయానికి తానెందుకు నోచుకోవడంలేదనే బాధ, ఆవేదన ప్రతి రైతులో మెండుగా కనిపిస్తోందని తెలిపారు. పండ్ల తోటలకు సుక్షేత్రంగా విలసిల్లాల్సిన రాయలసీమ ప్రాంత రైతాంగానికి రెండేళ్లుగా ఒక్క డ్రిప్ పరికరం కూడా సబ్సిడీపై అందిందిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా డ్రిప్ రాయితీ ఫలాలు రాయలసీమ రైతులకు అందించలేకపోవడంపై రాష్ట్ర వ్యవసాయాశాఖ మంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
చేతగానితనంతో రాష్ట్రాభివృద్ధి అధ:పాతాళంలోకి... : టిడిపి నేత అనిత
జగన్మోహన్ రెడ్డి అసమర్థత, చేతగానితనంతో రాష్ట్రాభివఅద్ధి అధ:పాతాళంలోకి వెళ్లిపోయిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, పార్లమెంట్ ను స్తంభింప చేస్తామని ఇక్కడ చెప్పేవారంతా, ఢిల్లీలో అమిత్ షాను, మోడీని చూడగానే వారికి వారే స్తంభించిపోతున్నారని ఘాటుగా విమర్శించారు. వారిపై ఉన్నకేసులకు భయపడుతున్నారా....లేక ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా? అని అనిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.










