ఒకప్పుడు నటీనటులు తమ క్యారెక్టర్ సెలక్షన్‌కు కొన్ని పరిధులు పెట్టుకునేవారు. ఒకవేళ కొత్త క్యారెక్టర్ ఏదైనా చేయాలన్నా.. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న సందేహంలో ఉండేవారు. అందుకే స్టార్ హీరోలు ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో, హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ పాత్రలకు పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందుకే కొందరు యువ నటీమణులు గ్లామర్ కన్నా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అలా ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్లలో వర్ష బొల్లమ్మ ఒకరు. ఇటీవల విడుదలైన 'స్వాతిముత్యం' చిత్రం విజయోత్సవం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు..
సినిమా ఇండిస్టీలోకి కొత్తగా వచ్చిన హీరోయిన్‌కి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి. వరుసగా సినిమాలు చేసేయాలి.. ఏ హీరోయిన్‌కీ రానంత మంచి గ్లామరస్ రోల్ రావాలి.. నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు ఉండాలి.. అప్పుడు గ్లామర్ డాళ్లా కనిపిస్తూనే.. మంచిపాత్రలు చేయొచ్చు అనుకుంటారు. అయితే వర్ష బొల్లమ్మ మాత్రం మంచి సైకో పాత్ర కావాలి, విలన్ అవ్వాలి అంటున్నారు. అయితే తమిళచిత్ర పరిశ్రమలో 'సతురాన్' చిత్రంతో వర్ష తన నటనా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 'థెరిగిరాధా', 'యానమ్ థియాన్' వంటి చిత్రాల్లో నటించారు. దీంతో పాటు మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటించిన తర్వాత తెలుగులోకి అడుగుపెట్టారు. తమిళంలో సూపర్ హిట్ అయిన '96' లో తను చేసిన పాత్రనే తెలుగు రీమేక్ 'జాను' లో కూడా చేశారు. ఆ విధంగా తెలుగువారికీ పరిచయమయ్యారు. అయితే హీరోయిన్‌గానే కాకుండా సెకండ్ హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చిన ప్రతి అవకాశాన్నీ వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటున్నారు.
'జాను'లో వర్ష క్యూట్ నటనకు ఇంప్రెస్ అయిన మేకర్స్.. తనకు యంగ్ హీరోల సరసన ఛాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. విజరు దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండతో 'మిడిల్ క్లాస్ మెలోడీస్' లో జత కట్టారు. ఆ తర్వాత 'పుష్పక విమానం', స్టాండ్ అప్ రాహుల్' వంటి చిత్రాల్లోనూ నటించారు. ప్రస్తుతం వర్ష.. బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్‌తో 'స్వాతిముత్యం' సినిమాలో నటించారు.
నటనకు ప్రాధాన్యముండాలి..
'సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అవకాశం అనగానే చేయాలనుకున్నాను. అలాగే కథ నచ్చడంతో 'స్యాతిముత్యం' చేయాలని ఫిక్స్ అయ్యాను. నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది. ఇందులో భాగ్యలక్ష్మి అనే టీచర్ పాత్ర చేశాను. బయట సరదాగా ఉంటాను, కానీ విద్యార్థుల ముందు కాస్త కఠినంగా ఉంటాను. నిజ జీవితంలోని నా గురువుల స్ఫూర్తితో ఈ సినిమాలో సహజంగా నటించాను. ఇందులో గణేష్ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. నా పాత్ర కొంచెం డామినేటింగ్‌గా ఉంటుంది. టాప్ హీరోయిన్ అవ్వాలనే ఆలోచన నాకు లేదు. నటిగా మంచిపేరు తెచ్చుకోవాలనుంది. కమర్షియల్ సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తాను.
పరిమితులు పెట్టుకోలేదు..
'చూడటానికి నేను పక్కింటి అమ్మాయిలా ఉంటాను.. కాబట్టి ఎక్కువగా మధ్యతరగతి పాత్రలే లభిస్తున్నాయని అనుకుంటున్నా. ప్రేక్షకులు కూడా నన్ను అలాంటి పాత్రల్లో చూడటానికే ఇష్టపడుతున్నారు. అయితే క్యారెక్టర్స్ పరంగా ఎలాంటి పరిమితులూ పెట్టుకోలేదు. ప్రతినాయిక ఛాయలుండే సైకో పాత్ర దొరికినా చేయగలననే నమ్మకం ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్నా. అయితే ఎక్కువగా తెలుగు సినిమాల మీదే దృష్టి పెడుతున్నా. ప్రస్తుతం సందీప్ కిషన్‌తో ఓ సినిమాలో నటిస్తున్నాను. మరో రెండు తెలుగు, తమిళ సినిమాలు కూడా ఉన్నాయి' అని చెప్పుకొచ్చారు.
'బిగిల్' సినిమాలోనూ ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా కీలక పాత్రలో నటించిన వర్ష బొల్లమ్మకు అన్నిరకాల పాత్రలు చేయడం అంటే ఇష్టమట. హీరోల తమ్ముళ్ల పక్కన వర్ష బొల్లమ్మ ఎక్కువగా నటిస్తుండగా అలా చేయడం గురించి ఆమె స్పందిస్తూ.. 'నేను కావాలని ఈ సినిమాలను ఎంపిక చేసుకోలేదు. అలా కుదిరిపోయింది.. అంతే' అని ఆమె చెప్పుకొచ్చారు. 'వైవిధ్యమైన కథలతో వస్తున్న దర్శకులు తనను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ అమ్మాయి ఇలాంటి పాత్ర కూడా చేస్తుందా అని అనుకునేలాంటి పాత్ర చేయాలని ఉంద'ని వర్ష బొల్లమ్మ తెలిపారు.
పేరు : వర్ష బొల్లమ్మ
పుట్టిన తేదీ : జులై 30, 1995
పుట్టిన ప్రదేశం : కోడగు, కర్ణాటక
నివాస ప్రాంతం : చెన్నరు
చదువు : మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేషన్
తల్లిదండ్రులు : పొదిలి కొట్టేశ్వర్, శాంతి మొన్నమ్మ