పుట్టపర్తి అర్బన్ : జిల్లా వ్యాప్తంగా జగనన్న విద్యాదీవెన పథకం కింద రూ.24.66 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ టిఎస్.చేతన్ తెలిపారు. 4వ విడత జగనన్న విద్యా దీవెన పథకం సంబంధించి 2022 జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదును బుధవారం జమ చేశారు. ఇందుకు సంబంధించిన జిల్లా స్థాయి కార్యక్రమాన్ని పుట్టపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న విద్యాదీవెన కింద 42,411 మంది విద్యార్థులకు సంబంధించి 38,099 మంది తల్లుల ఖాతాలకు రూ.24,66,18,443 నగదను జమ చేసినట్లు చెప్పారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న ఉద్ధేశంతో ముఖ్యమంత్రి విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం కింద ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యాభివద్ధికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తుంగ ఓబులేసు, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ అవుటాల రమణారెడ్డి, ఎంపిపి ఎవి.రమణారెడ్డి, పుడా చైర్మన్ లక్ష్మీనరసమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శివ రంగ ప్రసాద్, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మల జ్యోతి, డిటిడబ్ల్యూ మోహన్ రామ్, విద్యార్థినులు పాల్గొన్నారు.










