పిడిఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి
ప్రజాశక్తి-పీలేరు : ఉపాధ్యాయులు, ఉద్యోగులు జీతాలు చెల్లింపులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని పిడిఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం పీలేరు నియోజకవర్గంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగుల జీతాలు సక్రమంగా చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తూందని విమర్శించారు. ఈ జాప్యానికి కారణాలేంటో బయటపెడుతూ ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో 20వ తేదీ వరకు వేతనాలను దశలు వారీగా చెల్లిస్తున్నారని, ఇది సరికాదన్నారు. ఉపాధ్యాయుల, ఉద్యోగుల పిఎఫ్, ఎపిజిఎల్‌ఐ, సిపిఎస్ ఖాతాల్లో వారు చెల్లిస్తున్న డబ్బులు జమ చేయకుండా, వాటిని వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణారాహిత్యమేనన్నారు. పెన్షనర్లకు పిఆర్‌సి అరియర్లు 3 వాయిదాల్లో చెల్లిస్తామని, ఇప్పటికీ ఆ ప్రస్తావన ఎత్తకపోవడం దురదృష్టకరమన్నారు. కరువు భత్యం బకాయీల 7 వాయిదాలు గత 4 సం లుగా పెండింగ్‌లో ఉంచడాన్ని వారు విమర్శించారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు సదాశివరెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు.










