Jul 08,2021 20:24

హైదరాబాద్‌ : వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడమే తమ ధ్యేయమని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల 'వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ' పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. వైఎస్‌ఆర్‌ జయంతిని పురష్కరించుకుని హైదరాబాద్‌ రాయదుర్గం జెఆర్‌సి కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వైఎస్‌ చేసిన సంక్షేమ సంతకం ఇప్పటికీ రోల్‌మోడల్‌ అన్నారు. రైతులు చల్లగా ఉండాలని రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. ఉచిత విద్యుత్‌, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారన్నారు. కోటి ఎకరాలకు నీరు ఇవ్వడం కోసం జలయజ్ఞానికి వైఎస్‌ రూపకల్పన చేశారని గుర్తుచేశారు. పేద విద్యార్థులకు వందశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశారని వ్యాఖ్యానించారు. జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చి లక్షల ఉద్యోగాలను వైఎస్‌ భర్తీ చేశారని పేర్కొన్నారు. మహిళలు లక్షాధికారులు అవ్వాలని పావలా వడ్డీకే రుణాలు ఇప్పించారని చెప్పారు. నిరుపేదలకు వైఎస్‌ భూమి ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ రాజకీయాలకతీతంగా సాయం చేశారని తెలిపారు. సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే 'వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ' అని స్థాపించినట్లు వెల్లడించారు. సమానత్వం, స్వయం సమృద్ధి, సంక్షేమం పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేటికీ పేదరికం పోలేదన్నారు. తెలంగాణలో ఇప్పటికీ వైఎస్‌ఆర్‌ పాలనను తలచుకుంటున్నారని చెప్పారు. పేదరికాన్ని రూపుమాపడమే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుంటే ఎంతో మందికి భరోసా ఉండేదని చెప్పారు. సంక్షేమ పాలనలో సిఎం కెసిఆర్‌ విఫలమయ్యారని, కెసిఆర్‌ దృష్టిలో సంక్షేమమంటే 'గారడీ మాటల గొప్పలు.. చేతికి చిప్పలు' అని ఎద్దేవా చేశారు. సంక్షేమంలో నంబర్‌ వన్‌ అని చెప్పుకునే కెసిఆర్‌.. కరోనా వల్ల అప్పులపాలయిన వారికి ఏం చెబుతారని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగమని కెసిఆర్‌ వాగ్దానం చేశారని, ఇప్పటివరకు ప్రకటనలు లేవు, ఉద్యోగాలు రావు అని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారని, కుటుంబాలతో పాటు ఏకంగా రాష్ట్రాన్నే అప్పులపాలు చేశారని తెలిపారు.

పక్క రాష్ట్ర సిఎంను ఇంటికి పిలిచి భోజనాలు పెట్టడం తెలుసు.. కానీ సమస్యను పరిష్కరించుకోవడం తెలీదా?
కృష్ణా నదిపై రెండు సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే.. కెసిఆర్‌కు ఇప్పుడే తెలిసొచ్చిందా అని నిలదీశారు. పక్క రాష్ట్ర సిఎంను ఇంటికి ఆహ్వానించి భోజనాలు పట్టడం తెలుసు.. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించడం తెలుసు.. కానీ రెండు నిమిషాలు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవడం తెలీదా? మరోసారి కూర్చొని నీటి సమస్యను ఎందుకు చర్చించరు? అని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రమూ చూస్తూ కూర్చుందని, సమస్యను పరిష్కరించుకోవాలనే చిత్తశుద్ధి ఎవరిలోనూ లేదని అన్నారు. న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి చుక్కనూ వదులుకోమని స్పష్టం చేశారు. అలాగే, ఇతర ప్రాంతానికి చెందిన నీటిబొట్టు కూడా తీసుకోబోమని అన్నారు. రెండు ప్రాంతాలకూ న్యాయం జరగాలన్నదే తమ సిద్ధాంతమని చెప్పారు. ఎంతో మంది నేతలకు వైఎస్‌ఆర్‌ రాజకీయ భిక్ష పెట్టారని, వైఎస్‌ఆర్‌ను తిడుతుంటే ఈ కాంగ్రెస్‌ నేతలు చప్పుడు చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ఆర్‌ పేరును ఉచ్ఛరించే అర్హత లేదన్నారు. వైఎస్‌ఆర్‌ అసలైన వారసులం మేమేనన్నారు. నేటి నుంచి 100 రోజుల తరువాత పాదయాత్ర చేస్తానని వెల్లడించారు.