Feb 28,2023 19:21

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజరురామరాజు

జిజిహెచ్‌ హెచ్‌డిఎస్‌ సమావేశంలో కడప జిల్లా కలెక్టర్‌ వి.విజరురామరాజు
ప్రజాశక్తి-కడప అర్బన్‌ : జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న జిల్లా సర్వజన ఆసుపత్రి (జిజిహెచ్‌)ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని హెచ్‌డిఎస్‌ చైర్మన్‌, కడప జిల్లా కలెక్టర్‌ వి.విజరురామరాజు సభ్యులను ఆదేశించారు. మంగళవారం రిమ్స్‌ ప్రభుత్వ వైద్యకళాశాల బోర్డు మీటింగ్‌ హాలులో విజరురామరాజు అధ్యక్షతన 50వ ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కేవలం జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా రాయలసీమ స్థాయిలో కూడా ప్రజలకు అత్యుత్తమ, మెరుగైన వైద్య సేవలు అందిస్తోందన్నారు. జిజిహెచ్‌ పరిధిలో ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కేన్సర్‌ రీసెర్చ్‌ ఆసుపత్రి, నేత్ర వైద్యశాల, మానసిక వైద్యశాలలు అందుబాటులోకి రానున్నాయన్నారు. రాయలసీమలోనే అత్యాధునిక వైద్య సేవలు అందించే మెడికల్‌ హబ్‌గా వైఎస్‌ఆర్‌ జిల్లా జిజిహెచ్‌ విస్తత సేవలు అందించనుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్‌ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యం దిశగా జిజిహెచ్‌ అబివృద్ధి సొసైటీ ముందుకెళుతోందన్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాల వైద్యాధిపతులతో ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసుకుని సంబందిత వార్డుల్లో కొరత లేకుండా అవసరమైన వైద్య పరికరాల కోసం ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. వైద్య విభాగాధిపతులు కేవలం వైద్యం వరకే పరిమితం కాకుండా ఆయా విభాగాల్లో పరికరాల నిర్వహణ, యాజమాన్యంపై కూడా దష్టి సారించాలన్నారు. జిజిహెచ్‌లో ఉన్న అత్యంత విలువైన, అధునాతన వైద్యపరికారాలను నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే సహించేదిలేదని, శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రుల్లో కంప్లైంట్‌ బాక్సులను ఏర్పాటు చేయాలని సొసైటీ సభ్యులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సల సంఖ్యను పెంచాలన్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాల్లో అవసరమైన మందులను ప్రణాళికాబద్ధంగా నిల్వ ఉంచుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను కూడా పటిష్టం చేయాలన్నారు. రక్తనిధి కేంద్రంలో అన్ని రకాల పేషంట్లకు అత్యవసరమైన అన్ని గ్రూపుల రక్తాన్ని అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో వహనాల పార్కింగ్‌ క్రమబద్దీకరణ, సీసీ కెమెరాల నిరంతర నిఘా ఉంచాలన్నారు. వైద్య సిబ్బంది కోసం.. క్యాంటీన్‌ ను కూడా నిర్వహణలోకి తీసుకురావాలన్నారు. ఆసుపత్రిలో నిరంతారాయ విద్యుత్‌, ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిహెచ్‌ఎం కళాశాల విద్యార్థుల కోసం ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సహకారంతో క్రికెట్‌ స్టేడియంను కూడా ఏర్పాటు చేసేందుకు సంసిద్దంగా ఉన్నామని అందుకు అవసరమైన స్థలాన్ని కూడా చూడాలన్నారు. భవిష్యత్తులో జిజిహెచ్‌ను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం జిజిహెచ్‌లోని అన్ని విభాగాల వైద్యాధిపతులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఆయా విభాగాల్లో అవసరమైన వసతులు, సదుపాయాలు, వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది తదితర అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కడప నగర కమిషనర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌ చంద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కెఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు, సిఎస్‌ ఆర్‌ఎంఒ డాక్టర్‌ వై.శ్రీనివాసులు, ఎపిఎంఎస్‌ఐడిసి ఇఇ ఎ.బి.సురేంద్రనాథ్‌రెడ్డి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కె.నాగరాజు, ఎపి వివిపి డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ వై.హిమదేవి, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ మాధురి తదితర హెచ్‌డిఎస్‌ సభ్యులు, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్స్‌ డాక్టర్‌ శ్రీధర్‌, శ్వేతా, అన్ని విభాగాల వైద్యాధిపతులు పాల్గొన్నారు.