Jul 16,2021 07:43

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించడంతో ఉపరితల ఆవర్తనాలు పలుచోట్ల వచ్చే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. ప్రస్తుతం అమ్రేలి, సూరత్‌, ఆదిలాబాద్‌, బుల్దానా, జగదల్పూర్‌, విశాఖపట్నం తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని ఉత్తరకోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు, దక్షిణకోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 27.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బండి ఆత్మకూరులో 83.2, అత్యల్పంగా శ్రీశైలంలో 5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మహానంది మండలంలోని ఎంసి ఫారం పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.