ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబాటుకు గురయ్యాయి. ప్రగతి అన్నది ఎరగనివి. వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా ఉత్తరాంధ్ర నెత్తిన అణు కుంపటి పెట్టి...ప్రజలకు కంటి నిండా కునుకు కూడా లేకుండా చేయనున్నాయి. కొవ్వాడపై ఇటీవల రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ... శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 1208 మెగావాట్ల సామర్ధ్యంతో 6 రియాక్టర్లతో కూడిన అణు విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించిందని...పిఎంఓ కార్యాలయం సహాయ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.
అణు ప్రమాదాల నష్టాన్ని పూడ్చుకునే సామర్థ్యం అభివృద్ధి చెందిన దేశమైన జపాన్ కే లేకుండా పోయింది. అలాంటిది మన దేశం ఇటువంటి విపత్తులను తట్టుకోగలదా? అసలు ఒక దివాళా తీసిన కంపెనీతో ఒప్పందం చేసుకోవడమేమిటి? ప్రపంచమంతా నిషేధిస్తున్న అణు విద్యుత్ మనకు అవసరమా? ఇవన్నీ తెలిసి కూడా మోడీ ప్రభుత్వం ఎందుకు ఉవ్విళ్లూరుతోంది? ఇతర రాష్ట్రాలు నిరాకరించిన అణు విద్యుత్ ప్లాంట్ పట్ల జగన్ ప్రభుత్వ వైఖరి తెలియజేయాలి. కేంద్ర బిజెపి ప్రభుత్వం గుజరాత్ లోని మితివిర్ధిలో అణు విద్యుత్ కేంద్రం పెట్టాలని 2007లో నిర్ణయించింది. 2013 నాటికి పర్యావరణ, అటవీ అనుమతులు పొందింది. అయినా ఆగమేఘాల మీద 2016 జూన్ 4వ తేదీన మితివిర్ధిలో నిర్మించాలనుకున్న అణు విద్యుత్ కేంద్రాన్ని కొవ్వాడకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్‌లో ప్రజలు వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద కొవ్వాడకు తరలించడం ఎవరి ప్రయోజనం కోసం ?
ప్రపంచంలోనే అణు విద్యుత్ పరిశ్రమలు ఎక్కడా పెట్టడంలేదు. అణు విద్యుత్ కేంద్రాల్లో భద్రత లేదని ప్రపంచంలోని అణు నిపుణులు వక్కాణిస్తున్నారు. పార్లమెంట్‌లో మన రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు వెస్టింగ్‌హౌస్ అనే అమెరికా కంపెనీతో ఒప్పందం ఖరారు చివరి దశలో ఉందని ప్రభుత్వం తన సమాధానంలో తెలిపింది. ఈ కంపెనీ అమెరికాలో దివాళా తీసి ఐ.పి పెట్టింది. అలాంటి కంపెనీతో నేడు మోడీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఒప్పందంలో మరో ప్రమాదకరమైన అంశమేమిటంటే, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ కంపెనీకేమీ సంబంధం ఉండదట! బహుళజాతి సంస్థల బండారం ఎలా ఉంటుందో చెప్పటానికి ఇటీవలి విశాఖ ఎల్.జి పాలిమర్స్ ఉదంతం మన ముందే ఉంది. 1984లో భోపాల్‌లో జరిగిన ఘోర గ్యాస్ లీకు ప్రమాదానికి సంబంధించి ఇదే అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ బహుళజాతి సంస్థ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా నేటికీ పూర్తిగా పరిహారం చెల్లించలేదు. వారు చెల్లించక, మన ప్రభుత్వాలూ పట్టించుకోకపోవడంతో నేటికీ వేలాది మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో అక్కడ బాధపడుతూనే ఉన్నారు. అదే విధంగా అమెరికా లోని ఐస్లాండ్, రష్యా లోని చెర్నోబిల్, 2011లో జపాన్ లోని ఫు కుషిమాలో జరిగిన ప్రమాదంతో ఆ రాష్ట్రమంతా తీవ్రంగా నష్టపోయింది. పూర్తిగా వ్యవసాయమే ఆధారంగా ఉన్న ఆ రాష్ట్రంలో రేడియేషన్ వల్ల గాలి, భూమి, నీరు విషతుల్యం అయ్యాయి. ఈ విస్ఫోటనం తర్వాత ఏ దేశంలోను అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదు. ఇప్పటికే వున్న అణు విద్యుత్ కేంద్రాలను అనేక దేశాలు మూసివేస్తున్నాయి. మనకు రియాక్టర్లను ఎగుమతి చేస్తున్న అమెరికా తమ దేశంలో 4 విద్యుత్ కేంద్రాలు మూసివేసింది. జపాన్ లో 2 అణు విద్యుత్ కేంద్రాలు తప్ప మిగిలినవన్నీ మూసివేయడం జరిగింది. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగితే 170 కిలోమీటర్లు విస్తరించి దక్షిణాన కాకినాడ, ఉత్తరాన ఒడిషా లోని చత్రపూర్ వరకు జీవకోటి నశిస్తుంది. ఈ ప్రాంతాన్ని సర్వనాశం చేస్తుంది. ఒకేచోట 6 రియాక్టర్లు పెట్టడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు తెలియజేస్తున్నారు. వెస్టింగ్ హౌస్ ఉత్పత్తి చేసే ఎ.పి 1000 అనే రియాక్టర్లు ఇంత వరకు ప్రపంచంలో ఎక్కడా ఉపయోగించిన దాఖలా లేదు. ఎక్కడా పరీక్షించని రియాక్టర్లను ఆంధ్రప్రదేశ్ నెత్తిన అమెరికా రుద్దుతున్నది. అమెరికా కోసం భారత ప్రయోజనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాకట్టు పెడుతున్నాయి.
పైగా 1208 మెగావాట్ల సామర్ధ్యంతో 6 రియాక్టర్లతో కూడిన ఈ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుతో 8 వేల మందికి ఉపాధి దొరుకుతుందని సాకుగా చూపుతున్నారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తూ ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంటును ఎలాగైనా అమ్మి తీరుతామని చెబుతూనే మరోవైపు అత్యంత ప్రమాదకరమైన అణువిద్యుత్ కేంద్రంతో 8 వేల మందికి ఉపాధి కల్పిస్తామనడం పూర్తిగా అసంబద్ధం కాదా? అణు విద్యుత్ కేంద్రాలకు పెట్టుబడి బాగా అధికం. ఒక మెగావాట్ అణు విద్యుత్ ఉత్పత్తికి రూ.48 కోట్లు ఖర్చు అయితే ఒక మెగావాట్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 5 కోట్లు ఖర్చు అవుతుంది. సోలార్ టెక్నాలజీ నేడు బాగా అభివృద్ధి అవుతున్నది. పర్యావరణ సమస్య వుండదు. విండ్ టెక్నాలజీ కూడా నేడు అభివృద్ధి చెందుతున్నది. పర్యావరణ సమస్య లేని విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి.
ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్ర ప్రభుత్వం అణు విద్యుత్ కేంద్రాన్ని అంగీకరించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఒత్తిడి తేవాలి. రాష్ట్రానికి తీవ్ర ప్రమాదకారి అయిన అణు విద్యుత్ కేంద్ర నిర్ణయాన్ని ప్రజలు, మేధావులు, పర్యావరణవేత్తలు వ్యతిరేకించాలి. ప్రజలకు చౌకగా విద్యుత్‌ను అందించగలిగే పర్యావరణ హితమైన పవర్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.
/ వ్యాసకర్త సెల్: 9490300788 /
అల్లు రాజు











