Jul 14,2021 21:02
మీడియాతో మాట్లాడుతున్న ఎంపి విజయసాయిరెడ్డి

ప్రజాశక్తి-సిరిపురం (విశాఖ) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, దీనిపై పార్లమెంట్‌ సమావేశంలో నిలదీస్తామని వైసిపి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద వచ్చే నెల 2, 3 తేదీల్లో ఉక్కు కార్మిక సంఘాల చేపట్టే నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన విశాఖ సర్క్యూట్‌ హౌస్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర ఉక్కు, ఆర్థిక శాఖ మంత్రులను కలుస్తామన్నారు. బిజెపియేతర పక్షాలను కలుపుకొని లోక్‌సభ, రాజ్యసభలో గళం వినిపిస్తామని చెప్పారు. నష్టాల పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించడాన్ని వైసిపి వ్యతిరేకిస్తోందని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉంటే వాటిని లాభాల్లోకి తీసుకురావాలే తప్ప, ప్రయివేటు వ్యక్తులకు అమ్మకూడదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రుణాన్ని ఈక్విటీగా మార్చి రుణ, వడ్డీ భారాలు తగ్గించాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం డబ్బుల కోసమే ప్రయివేటు వారికి అమ్మదల్చుకుంటే, మూడో ప్రత్యామ్నాయంగా స్టీల్‌ప్లాంట్‌ను ఎన్‌ఎండిసిలోగానీ, సెయిల్‌లోగానీ విలీనం చేయాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయిస్తే తక్కువ ధరకు ముడిసరుకు లభిస్తుందన్నారు. క్యాప్టివ్‌ మైనింగ్‌ ఎక్కడి నుంచో తెచ్చుకునే కంటే సాలూరు, ఒడిశా బోర్డర్‌ కోటియా గ్రామాల వద్ద ఉన్న ఐరన్‌ ఓర్స్‌ను కేటాయిస్తే స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తికి ఎటువంటి ఆటంకమూ ఉండదని తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉక్కు ఉద్యమ సెగ ఢిల్లీకి తగిలేటట్టుగా ముఖ్యమంత్రి ఆదేశానుసారం పార్లమెంట్‌లోనూ, బయటా పోరాడుతామన్నారు.

ఎంపి విజయసాయిరెడ్డికి వినతిపత్రం ఇస్తున్న ఉక్కు కార్మిక సంఘాల నాయకులు
ఎంపి విజయసాయిరెడ్డికి వినతిపత్రం ఇస్తున్న ఉక్కు కార్మిక సంఘాల నాయకులు