Dec 11,2021 07:01

   ట్టి మనుషులే గెలిచారు. వ్యవసాయ చీకటి చట్టాలను తుద ముట్టించిన విజయోత్సాహంతో కనీస మద్దతు ధర చట్టం కోసం మరో ఉద్యమానికి అన్నదాతలు నడుం బిగించారు. పోరాటానికి ముగింపు లేదంటూ ఉద్యమ దివిటీలు వెలిగించారు. కార్పొరేట్‌ కంపెనీలకు వ్యవసాయాన్ని గంపగుత్తగా కట్టబెట్టే పన్నాగంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వినాశకర చట్టాలను, విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కనీస మద్దతు ధర కోసం చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ 2020 నవంబరు 26న ఢిల్లీ సరిహద్దుల్లో ప్రారంభించిన అన్నదాతల ఆందోళనలు నేటితో ఫలించాయి. కష్టజీవుల కష్టార్జితాన్ని కార్పొరేట్‌ బొక్కసాలకు దోచిపెట్టేసి అటు రైతుల హక్కులనే కాకుండా ఇటు ప్రజల ఆహార భద్రత హక్కును కూడా కాలరాయాలని చూసిన పాలకుల దుర్నీతిని ఎండగట్టిన ఈ మహోజ్వల ఉద్యమాన్ని ధీరోచితంగా సాగించిన అన్నదాతలకు జేజేలు. దేశానికి వెన్నెముకైన రైతాంగం, వ్యవసాయ కార్మికులు సమరశంఖారావం పూరించిన రోజు నుంచీ అండదండలనందిస్తూ సమస్త కార్మికవర్గం రైతుల పోరాటానికి వెన్నెముకగా కష్టజీవుల ఐక్యతను చాటింది.
     ఇటీవల కాలంలో నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఇన్ని లక్షల మంది ప్రజలు ఇంత సుదీర్ఘ కాలం సాగించిన ప్రజా పోరాటం మరొకటి లేదు. అంతర్జాతీయ సమాజం నుండి ఈ పోరాటానికి వెల్లువెత్తిన సంఘీభావమే ఇందుకు నిదర్శనం. ప్రపంచ చరిత్రలో చిరస్మరణీయ ఉద్యమాల జాబితాల్లో ఢిల్లీ అన్నదాతల ఉద్యమం కూడా అగ్రశ్రేణిలో నిలుస్తుంది. అందరికీ అన్నం పెట్టే చేయి అవసరమైతే ఉద్యమ జెండా కూడా చేపట్టి ధీరత్వాన్ని చాటుతుందనడంలో సందేహం అక్కర్లేదని చాటి చెప్పిన చారిత్రక ఘట్టాల్లో రైతుల ఉద్యమం నిలుస్తుంది. 'కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి' అని ఢిల్లీ పెద్దల మెడలొంచిన ఈ పోరాటం ఎన్నో విధాల ప్రత్యేకమైనది.
   సంఘం కట్టడం, ఐక్యత చాటడం, పాలకుల కుట్రలను సంఘటితంగా తిప్పికొట్టడం, లౌకికతత్వం, మెజార్టీ నిర్ణయాన్ని అమల్జేయడం, క్రమశిక్షణతో అత్యంత ప్రజాస్వామ్యయుత పద్ధతుల్లో హింసకు ఏమాత్రం తావు ఇవ్వకుండా ఈ ఉద్యమం సాగింది. ఈ పోరాటాన్ని అణిచేసేందుకు పాలకులు పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. అయినా రైతే గెలిచాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 పైబడి రైతు సంఘాలు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌.కె.ఎం) పేరిట ఒకే గొడుగు కిందకు రావడం అసాధారణమైన విషయం. సేద్యం పనుల్లో సగానికి పైగా మహిళలే. ఢిల్లీ ఉద్యమంలోనూ వారు తమ శక్తిని చాటారు. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా పోరు సల్పారు. ఉద్యమ బలోపేతానికి బీజాలు నాటిన మరో విశేషమైన లక్షణం ఈ పోరాటం ఆసాంతం లౌకికవాద పద్ధతుల్లో సాగడం. రైతు ఉద్యమాన్ని కులం పేరిటో, మతం పేరిటో పరిమితం చేసి చిదిమేయాలని కేంద్రం తలచినా ఆ కుట్రలను తుత్తునియలు చేసింది ఉద్యమానికి ఉన్న ఈ లౌకిక లక్షణమే. భారత్‌ బంద్‌ సహా సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన అన్ని ఉద్యమ పిలుపుల్లోనూ సమస్త ప్రజానీకం భాగస్వాములై ప్రజాపోరాటంగా చాటాయి. అన్నిటికీ మించి కార్పొరేట్‌ శక్తులను నేరుగా ఢకొీట్టడం రైతు ఉద్యమ ప్రత్యేకత. కార్పొరేట్‌ శక్తులకు, పాలకుల మధ్య ఉన్న అనుబంధాన్ని బట్టబయలు చేయడంతో పాటు అదానీ, అంబానీ సంస్థల ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునివ్వడం సామాన్యమైన విషయం కాదు. ఖలిస్తానీలు, మావోయిస్టులు, పాకిస్తాన్‌, చైనా ఉసిగొల్పితేనే రైతులు రంగంలోకి దిగారంటూ ప్రభుత్వ అనుకూల మీడియా దుమ్మెత్తి పోసినా కష్టజీవులు చలించలేదు. దాదాపు 90 రోజుల పాటు లక్షలాది మంది రైతులు ఢిల్లీని ముట్టడించినా ఆ ముట్టడి ప్రశాంతంగా అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సాగిందంటే అది శ్రమజీవుల క్రమశిక్షణకు ప్రతీక. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట సాక్షిగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా హింసాకాండకు బరితెగించినా కర్షకలోకం సంయమనం పాటించిందే తప్ప ఆవేశాలకు పోయి ఉద్యమాన్ని చేజారనీయలేదు. భాష్పవాయు గోళాలు, నీటి ఫిరంగులు, లాఠీఛార్జీలు, జనవరి 26న జరిగిన ప్రభుత్వ ప్రాయోజిత హింసాకాండ, విచ్చలవిడి అరెస్టులు, రైతు నేతల పైనా, ప్రముఖ పాత్రికేయుల పైనా ఎఫ్‌ఐఆర్‌ లు, పర్యావరణ కార్యకర్తల అరెస్టులు, న్యూస్‌ క్లిక్‌ వంటి స్వతంత్ర మీడియా పోర్టళ్లపై ఇ.డి దాడులు, ఉద్యమిస్తున్న రైతులను మంత్రి కుమారుడు కాన్వారుతో తొక్కించి చంపేయడం వంటి ఎన్ని దారుణాలకు పాల్పడినా రైతే నిలిచి గెలిచాడు. కార్మికలోకం అండదండలతో సంఘటితంగా, ఐక్యంగా పోరాడి మహత్తర విజయాన్ని సాధించిన కర్షక లోకానికి ఉద్యమాభినందనలు.