Feb 27,2023 18:53

ఇంటింటి ప్రచారంలో సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : తూర్పు రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వరరెడ్డి, బాబురెడ్డిని గెలిపించి పాలకపక్షాలకు కళ్లు తెరిపించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని విజయనగర్‌ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. నాయకులు మధురవాణి, రామకృష్ణ, ఐద్వా కార్యదర్శి భాగ్యమ్మతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగులు, పట్టభధ్రులు, ఉద్యోగులు, సామాన్యప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చని పాలక ప్రతిపక్ష పార్టీలను ఓడించి ఉద్యమ నేతలను గెలిపించాలన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయకుండా ఉన్న పార్టీల అభ్యర్థులను ఓడించాలని తెలిపారు. మనహక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపు తోడ్పడుతుందన్నారు.