Aug 27,2022 16:16

ప్రజాశక్తి-నందిగామ : మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు‌.  నందిగామ మండలం మాగల్లు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాలవెల్లువ కార్యక్రమం మరీయు డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను పాల్గొని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఉదయభాను  మాట్లాడుతూ మాగల్లు గ్రామంలో కేడీసీసీ బ్యాంకు సహకారంతో సుమారు ఒక కోటి 28 లక్షల 68 వేల రూపాయలతో జగనన్న పాలవెల్లువ ద్వారా పాల ఉత్పత్తిదారులకు గేదెల కొనుగోలు నిమిత్తం మరియు డ్వాక్రా మహిళలకు 82లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తెలిపారు.దీని ద్వారా మహిళలు స్వయంగా పాడి గేదెలు కొనుగోలు చేసి వారి స్వయంవృద్ధికి తోడ్పాటు అవుతుంది అని అన్నారు. గతంలో చంద్రబాబు డ్వాక్రా సంఘాల మహిళలకు అన్యాయం చేశారని పసుపు కుంకుమ ద్వారా పదివేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని,నేడు జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వంలో పొదుపు సంఘాల్లోని డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వైయస్సార్ ఆసరా, 0 వడ్డీ ద్వారా మహిళలకు న్యాయం జరిగేలా చేశారని,వారు బ్యాంకులకు కట్టవలసిన అప్పు మొత్తం మాఫీ చేసి మహిళా పక్షపాతిగా నిలిచారని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మహిళల అభ్యున్నతికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ అనేక సంక్షేమ పథకాలను మహిళల బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తూ మనసున్న ముఖ్యమంత్రిగా మన్ననలు పొందుతున్నారని అన్నారు.నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారని, పిల్లల చదువులకు అయ్యే ఖర్చు అమ్మఒడి, విద్యా దీవెన,వసతి దీవెన ద్వారా నేరుగా తల్లుల ఖాతాలోనే జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు,డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్,రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు, సర్పంచ్ గుంటి ఆశాజ్యోతి,నాయకులు దేవినేని రామారావు,లగడపాటి వీరయ్య,అంగడాల పూర్ణచంద్రరావు,మేడ కోటేశ్వరరావు,కనగాల వెంకటేశ్వరరావు,చెరుకూరు రమేష్,కొల్లూరు ఉమా మహేశ్వరరావు,జిల్లేపల్లి రాము, నాదెండ్ల శ్రీనివాస్ తదితర ముఖ్య నాయకులు అధికారులు కేడీసీసీ బ్యాంకు అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.