Dec 15,2022 07:38
  • ఇప్పటికే రూ.2,900 కోట్లు వసూలు చేస్తున్న డిస్కమ్‌లు
  • పెండింగ్‌లో రూ.1108 కోట్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఎపిఇఆర్‌సికి సమర్పించిన ఆదాయ అవసర నివేదిక (ఎఆర్‌ఆర్‌)ల్లో ట్రూ అప్‌ ఛార్జీలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ప్రజల నుంచి డిస్కంలు రూ.2,900 కోట్లు వసూలు చేస్తున్నాయి. మరో రూ.1048 కోట్ల భారం పెండింగ్‌లో ఉంది. ఎఆర్‌ఆర్‌లో ఈ అంశాలు పొందుపరచలేదు. 2023-24 ఆదాయ అవసర నివేదికలను (ఎఆర్‌ఆర్‌) డిస్కంలు మంగళవారం సమర్పించిన విషయం తెలిసిందే. గతేడాది ఇచ్చిన ఎఆర్‌ఆర్‌లో రూ.6,165 కోట్ల ట్రూఅప్‌ భారాన్ని వినియోగ దారులపై డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. ఈ ట్రూఅప్‌ భారాన్ని రద్దు చేయాలని ప్రజాసంఘాలు, వినియోగదారులు ఆందోళనలు చేయడంతో రూ.2,910 కోట్లకు ఇఆర్‌సి అనుమతించింది. ఈ అనుమతి ఇచ్చిన ఛార్జీలను డిస్కమ్‌లు ఈ ఏడాది ఆగస్టు నుంచి వసూలు చేస్తున్నాయి. యూనిట్‌కు 0.23పైసలు చొప్పున ఎపిఎస్‌పిడిసిఎల్‌, 0.22పైసలు చొప్పున ఎపిసిపిడిసిఎల్‌ 36 నెలలు పాటు వసూలు మొదలుపెట్టాయి. ఇపిడిసిఎల్‌ యూనిట్‌కు 0.07పైసలు చొప్పున 18 నెలల పాటు ఇప్పటికే వసూలు చేస్తోంది. 2021-22 చివరి త్రైమాసికంలో తమకు నష్టాలు వచ్చాయని రూ.1048 కోట్లను డిస్కమ్‌లు ఈ ఏడాది ఆగస్టు 11న ఇఆర్‌సికి ప్రతిపాదించాయి. ప్రస్తుతం దీనిపై ఇఆర్‌సి ఒకసారి విచారణ జరిపింది. సరఫరా వ్యాపారంలో ట్రూఅప్‌ కింద ఈసారి రూ.285.77 కోట్లను ఎస్‌పిడిసిఎల్‌ చూపించింది. 2023-23లో కూడా ఆదాయ లోటు రూ.11,911 కోట్లు డిస్కమ్‌లు సమర్పించాయి. ఇందులో రూ.11,123.21 కోట్లు రాయితీ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అన్ని రాష్ట్రాల కంటే టారిఫ్‌ ఎపిలోనే తక్కువ అని చెబుతూ శ్లాబుల మార్పుతో రూ.1400 కోట్ల మేర భారం ప్రజలపై మోపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎఆర్‌ఆర్‌లో మూడు డిస్కమ్‌లు రూ.12,782 కోట్లు ఆదాయ లోటుగా చూపించాయి. ఈ లోటును ఎలా భర్తీ చేసుకుంటారన్న విషయాన్ని గోప్యంగా ఉంచాయి. ఈ భారం ఎవరిపై పడనుందన్న విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతో మళ్లీ ట్రూఅప్‌ వసూలుకు డిస్కమ్‌లు ప్రతిపాదిస్తాయనే ఆందోళన వినియోగదారుల్లో నెలకొంది.