ప్రజాశక్తి-యంత్రాంగం : దక్షిణ ఒడిశాాఉత్తర ఆంధ్రా తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలు చోట్ల బుధవారం మోస్తరు వర్షాలు పడ్డాయి. అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. అమలాపురం, రావులపాలెం, మండపేట, రామచంద్రపురం, కడియం, ఆలమూరు మండలాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై మోకాల్లోతు నీరు చేరింది. వర్షాలకు మెట్ట రైతులు వ్యవసాయ పనులను వేగవంతం చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు తాండవ నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరిలో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. కర్నూలుతోపాటు జిల్లాలోని 48 మండలాల్లో వర్షాలు పడ్డాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 7.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గడివేముల మండలంలో 29.6 మిల్లీమీటర్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు, సంతబమ్మాళి, సీతంపేటలో వర్షాలు పడ్డాయి. సీతంపేటలో కుండపోత వర్షం కురిసింది. విశాఖ శాఖ ఏజెన్సీలోని పలు మండలాల్లో జల్లులు పడ్డాయి. జికె.వీధి, అనంతగిరి మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి. గురువారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.










