Nov 28,2022 21:45

అధికారులు వెళ్లిపోవాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి-నంబులపూలకుంట :ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఉన్న తిమ్మమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖకు ఇచ్చేది లేదంటూ ఆ గ్రామస్తులు స్పష్టం చేశారు. నంబులపూలకుంట మండల పరిధిలోని గూటిబైలు గ్రామంలో తిమ్మమ్మ మర్రిమాను వద్ద తిమ్మమ్మ ఆలయం ఉంది. ఇటీవల ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి తీసుకొచ్చేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం నాడు ఆ శాఖ అధికారులు ఆ గ్రామం వద్దకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచి విష్ణుమూర్తి, గ్రామస్తులు నిరసన తెలిపారు. అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. తమ కులదైవంగా భావించి, నిత్యం పూజులు నిర్వహించే ఆలయాన్ని దేవాదాయ శాఖకు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు. అధికారులు ఎలాంటి ముందుస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయ స్వాధీనానికి రావడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాయల్‌ పీపుల్‌ ఫ్రంట్‌ వ్యవస్థాపకులు తిరుమల శెట్టి రెడ్డిశేఖర్‌ రాయల్‌, తనకల్లు మండల అధ్యక్షులు దేసుగారి బాలాజీ, తలుపుల మండల కన్వీనర్‌ అన్నం జయవర్ధన్‌, ఎన్పీ.కుంట మండల కన్వీనర్‌ మహేశ్వర, ఎర్రంశెట్టి రమేష్‌ బాబు, నందిశెట్టి బాబు పాల్గొన్నారు.