ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖ బ్యూరో : రాష్ట్రంలోని తీర ప్రాంత భద్రతపై తూర్పునౌకాదళంలో శుక్రవారం అత్యున్నత అపెక్స్ కమిటీ సమావేశం సమీక్షించింది. తీరప్రాంత భద్రత పట్ల నావికాదళం, తీర రక్షణ దళం (కోస్ట్ గార్డ్) మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ సమావేశం అభిప్రాయపడింది. సముద్ర తీరంతో సంబంధం ఉండే రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర సంస్థలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి. తూర్పునౌకాదళ అధిపతి ఆజేంద్ర బహదూర్ సారధ్యంలో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధిత్యనాథ్ దాస్, తూర్పునౌకాదళ చీఫ్ ఎ.బి.సింగ్ తీరప్రాంత భద్రతపై తొలుత చర్చించారు. తీరభద్రతకు తూర్పునౌకాదళం చేస్తోన్న కృషిని చీఫ్ సెక్రటరీకి ఎ.బి.సింగ్ వివరించారు. రాష్ట్ర రాజధానిగా విశాఖను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫిషరీస్ డిపార్టుమెంట్ ఉన్నతాధికారులు, కోస్ట్ గార్డ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, కస్టమ్స్, కేంద్ర సంస్థలు సిఐఎస్‌ఎఫ్, మెరైన్ పోలీస్, మైనర్ పోర్టు అథారిటీస్, ఆయిల్ ఆపరేటర్లు అంతా కలసి స్టీరింగ్ కమిటీ రివ్యూ ఆన్ కోస్టల్ సెక్యూరిటీ (ఎస్‌సిఆర్‌సిఎస్)గా అత్యంత కీలకమైన అంశాలపై చర్చించారు. తీర భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రస్తుతం ఉన్న రక్షణ అంశాలు ఎలా ఉన్నాయి? మౌలిక సదపాయాలు ఏ మేరకు ఉన్నాయి? కోస్తా తీరం వెంబడి గ్రామాలు, వాటిల్లో కమిటీలు ఉన్నాయా? లేకపోతే ఎప్పటిలోగా వేయాలి? బయట నుంచి సముద్రంపైకి వచ్చే కొత్త వ్యక్తులను మత్స్యకారులు గుర్తించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు? వంటి పలు కీలక విషయాలపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఈ సమావేశంలో తీర భద్రతకు సంబంధించిన లక్ష్యంపై అనేక పరిష్కారాలను స్వీకరించినట్లు నేవీ ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి వెల్లడించారు. పలు ముఖ్యమైన పరిష్కారాలపై ప్రభుత్వం, తూర్పునౌకాదళం సంయుక్తగా చేపట్టే దిశగా కార్యాచరణ ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు స్టేక్ హోల్డర్‌లుగా గణనీయమైన ప్రగతిని తీరభద్రత విషయంలో సాధించగల్గుతామని వెల్లడించారు. 2020లో కోవిడ్ కారణంగా అపెక్స్ సమావేశం నిర్వహించలేకపోయినట్లు తూర్పునౌకాదళం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ తీర ప్రాంత భద్రత, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పలు కీలక ప్రాజెక్టులను భవిష్యత్తులో చేపడుతుందని, అత్యాధునిక మౌలిక వసతులతో రాష్ట్ర తీర రక్షణ కోసం కృషి చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. నేవీకి పూర్తిగా ప్రభుత్వ మద్దతు ఉంటుందన్నారు. నేవీ చీఫ్ ఎ.బి.సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల అధికారులు తీర భద్రత కార్యక్రమాలకు సంబంధించిన చర్యలపై సకాలంలో టైం బాండ్ పూర్తి చేయాలని కోరారు.










