Jul 16,2021 20:43

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్‌ ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలను తగ్గించడంలో గణనీయమైన పనితీరు చూపాయని ఐసిఎంఆర్‌ వెల్లడించింది. టీకా తీసుకున్న తర్వాత వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులపై ఐసిఎంఆర్‌ ఒక అధ్యయనం నిర్వహించింది. కొవిడ్‌ రెండో దశ ఉద్ధఅతి సమయంలో నిర్వహించిన ఈ అధ్యయనం దేశంలోనే మొదటిది, అలాగే భారీది కూడా. ఈ పరిశీలనలో అనేక కీలక విషయాలను ఐసిఎంఆర్‌ గుర్తించింది. ప్రధానంగా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితిని, మరణాలను తగ్గించిందని, డెల్టా వేరియంట్‌పై ప్రభావంతంగా పనితీరు కనబరుస్తున్నట్లు తెలిపింది.'అందువల్ల, టీకా డ్రైవ్‌ను పెంచడం, ప్రజలకు వేగంగా రోగనిరోధక శక్తిని ఇవ్వడం కోవిడ్‌ -19 యొక్క మరింత తీవ్రమైన దశలను నివారించడానికి చాలా ముఖ్యమైన వ్యూహంగా ఉండాలి. ఈ వ్యూహం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుంది' అని అధ్యయనం తెలిపింది. దేశంలో 677 మంది కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులపై ఈ అధ్యయనం నిర్వహించగా, వీరిలో 80 శాతం మందికిపైగా డెల్టా వేరియంట్‌ బారిన పడ్డారని చెప్పింది. ఈ మొత్తం కేసుల్లో 9.8 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని, 0.4 శాతం మరణాలు సంభవించాయని అధ్యయనం తెలిపింది. అలాగే వీరిలో 482 (71 శాతం) మందికి లక్షణాలు కన్పించగా, 29 శాతం మందికి ఏ లక్షణాలు లేవు. లక్షణాలు ఉన్నవారిలో జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, రుచి, వాసన తెలియకపోవడం, నీళ్ల విరేచనాలు, శ్వాస తీసుకోలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

త్వరలో అందుబాటులోకి చిన్నారుల వ్యాక్సిన్‌
చిన్నారులపై వ్యాక్సిన్‌ పరీక్షలు పూర్తయ్యాయని,త్వరలోనే టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం ఈ విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. 12 ఏళ్లు నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్‌పై వేసిన పిటిషన్‌ను శుక్రవారం చీఫ్‌ జస్టిస్‌ డిఎన్‌ పాటిల్‌, జస్టిస్‌ జ్యోతి సింగ్‌ విచారించారు. ఈ వయస్సు వారికి తయారు చేసిన జైడస్‌ కాడిలా వ్యాక్సిన్‌ పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలోనే విధానాన్ని ఖరారు చేస్తామని ధర్మాసనానికి అదనపు సోలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మ తెలిపారు. త్వరలోనే ఈ చిన్నారుల వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అలాగే 2 నుంచి 18 ఏళ్ల వారి కోసం భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ పరీక్షలకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చిన విషయాన్ని కూడా చేతన్‌ శర్మ కోర్టుకు తెలిపారు. చిన్నారులకు టీకా కోసం దేశంయావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తుందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 6కి వాయిదా వేసింది.

38 వేలకు పైగా కొత్త కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గురువారం 19,55,910 మందికి పరీక్షలు నిర్వహించగా, 38,949 మందికి పాజిటివ్‌గా తేలింది. బుధవారంతో పోల్చితే కేసుల్లో 6.8 శాతం తగ్గుదల నమోదైంది. కాగా, గత 24 గంటల్లో 542 మంది మరణించారు. మొత్తం కేసులు 3 కోట్ల 10లక్షలకు, మరణాలు 4,12,531కు చేరుకున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళలో కొత్తగా 13 వేల మందికి కరోనా సోకగా.. మహారాష్ట్రలో 8వేల మంది వైరస్‌ బారినపడ్డారు. గురువారం 40 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.28 శాతంగా ఉంది. క్రియాశీల రేటు 1.39 శాతంగా ఉంది. ప్రస్తుతం 4,30,422 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మొత్తంగా 3.01కోట్ల మందికిపైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గురువారం 38.78 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 39.53 కోట్లుగా ఉంది.