కరోనా మహమ్మారి విజృంభణ తరుణంలో వెలువడుతున్న వ్యాక్సిన్ ప్రయోగ వార్తలు ప్రపంచ మానవాళిలో ఆశలు రేకెత్తిస్తుండగా ఈ సందర్భాన్ని సైతం ప్రచారార్భాటానికి వాడుకొని ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని మోడీ, ఆయన ప్రభుత్వం పడుతున్న తాపత్రయం జుగుప్సాకరం. సోషల్ మీడియా మొదలుకొని మన్ కీ బాత్, చాయ్ పె బాత్ వరకు దేన్నీ విడిచిపెట్టకుండా అందంగా, ఆకర్షణీయంగా సొంత డబ్బా కొట్టుకోవడంలో ప్రధానిది అందె వేసిన చెయ్యి. ఆ వరసలో ఇప్పుడు కరోనా టీకా సైతం చేరిపోయింది. వ్యాక్సిన్ పంపిణీపై గత నెల 24న వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు మోడీ. వ్యాక్సిన్ ఎన్ని డోసులు వేయాలి? ఏ విధంగా మానవ శరీరంలోకి పంపాలి? ధర ఎంత? ఏ వర్గాలకు ఇవ్వాలనే ప్రాధాన్యతా క్రమం ఏమిటి? ఎప్పటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది? ఈ విషయాల్లో దేనిపైనా స్పష్టత ఇవ్వకుండా వ్యాక్సిన్ రవాణా, పంపిణీ, నిల్వకు సిద్ధంగా ఉండాలని అనర్గళంగా ఉపన్యసించారు. తదుపరి మూడు రోజులకు, నవంబర్ 28న దేశంలో టీకాను అభివృద్ధి చేస్తున్న మూడు కార్పొరేట్ ఫార్మా సంస్థలకు ప్రత్యేక విమానంలో టూర్ వేసి వ్యాక్సిన్ వేగంగా రావాలని చెప్పొచ్చారు. అహ్మదాబాద్‌లోని జడైస్ క్యాడిలా, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పూణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్లకు సుడిగాలి పర్యటన చేసి టీకాపై వేగం పెంచాలని శాస్త్రవేత్తలను తొందర పెట్టారు.
వాస్తవానికి వ్యాక్సిన్‌పై ప్రధాని హడావిడి ఇప్పుడే మొదలు కాలేదు. పంద్రాగస్టు రోజున ఢిల్లీ ఎర్రకోటపై ప్రకటన చేయాలని చూశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్‌తో వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థలకు ఆదేశాలిప్పించారు. ప్రజల ఆరోగ్య భద్రతకు సంబంధించిన వ్యాక్సిన్‌లకు రాజకీయ లబ్ధినాశించి కాల వ్యవధి నిర్ణయించడం కూడదని విజ్ఞాన సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో తోకముడిచారు. మొన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర ప్రజలకే ముందు వ్యాక్సినేషన్ చేస్తామని వాగ్దానం చేసి మిగతా దేశ ప్రజల్లో అభాసుపాలయ్యారు. తాజాగా హైదరాబాద్ నగర పాలక ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా రెండ్రోజుల ముందు అక్కడి భారత్ బయోటెక్‌ను సందర్శించి బిజెపి తరఫున పరోక్ష ప్రచారానికి ఒడిగట్టారు. టీకాపై శాస్త్రీయంగా సరైన స్పష్టత రాకమునుపే మోడీ, ఆయన ప్రభుత్వ, పార్టీ గణాలు ఆకాశమే హద్దుగా ప్రచారం లంకించుకోవడం వెనుకనున్న ఉద్దేశం స్పష్టం. కరోనా సమయాన ట్రంప్‌తో బహిరంగ సమావేశం, మధ్యప్రదేశ్‌లో అధికార కుర్చీలాట, అనాలోచిత లాక్‌డౌన్ విధింపు, వలస కూలీల విస్మరణ, ఆర్థిక సంక్షోభం, ప్రజలకు ఉపాధి కల్పన, కనీస ఆర్థిక సహాయం, రాష్ట్రాలకు నిధులు వంటి ప్రధాన కర్తవ్యాల నిర్వహణలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అడ్డదారిలో పి.ఎం కేర్స్‌్‌కు తరలించిన విరాళాలను రహస్యంగా ఉంచింది. వాటన్నింటి నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు వ్యాక్సిన్ అంశాన్ని వాడుకోవాలని చూస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వ్యాక్సిన్‌లు 90 శాతానికిపైగా సక్సెస్ అయ్యాయి. మరో 20 వ్యాక్సిన్‌లు 50 శాతం మేర ఫలప్రదమయ్యాయి. మరికొన్ని అనుకూల ఫలితాల దిశగా సాగుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి ఈ స్థాయికి చేరడం శాస్త్ర సాంకేతిక గొప్ప విజయం. వ్యాక్సిన్‌లు వేగంగా రావడం ఎంత ముఖ్యమో, ప్రజల ఆరోగ్యపరంగా సురక్షితమూ అంతే ముఖ్యం. ఆక్స్‌ఫర్డ్ సహా కొన్నింటికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అన్నీ కుదిరి వ్యాక్సిన్ వచ్చాక ప్రజలందరికీ వాక్సినేషన్ పెద్ద సవాల్. అమెరికా వంటి సంపన్న దేశాలు అడ్వాన్స్ బుకింగ్‌లు చేసుకుంటున్నాయి. ప్రపంచంలోని 20 శాతం మందికి వ్యాక్సినేషన్ చేయాలంటే 2 బిలియన్ డాలర్లు కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేయగా ఇప్పటికి 800 మిలియన్ డాలర్లే సమకూరాయి. ఈ లెక్కన పేద దేశాల్లో వ్యాక్సినేషన్ రెండు మూడేళ్లు పడుతుంది. ఈ విషయాలేవీ మోడీకి పట్టట్లేదు. మరో వంక సంఘపరివారం ఆవు మూత్రంతో కరోనా అంతమౌతుందంటూ వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న మౌఢ్య ప్రచారం సరేసరి. కరోనా మొదట్లో మోడీ కాబట్టి చెయ్యి అడ్డంపెట్టి మహమ్మారిని ఆపారని బిజెపి, పరివారం చెప్పింది. తీరా కోటి కేసులు, లక్షకు పైన మరణాలు, కేసుల్లో ప్రపంచంలో రెండవ స్థానానికి మోడీ ఏలుబడిలోని మన దేశం ఎగబాకేసరికి నాలుక్కరుచుకున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ ఘనత మోడీదేనంటున్నారు. కింద పడ్డా నాదే పై చేయి అనడం అంటే ఇదే.










