జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాఠశాల భవనాల మరమ్మతులు, స్కూళ్లలో అదనపు గదుల నిర్మాణం, కుర్చీలు, బెంచీలు, స్క్రీన్ బోర్డులు, మరుగు దొడ్లు తదితర మౌలిక సదుపాయాలు సమకూర్చడం మంచిదే. దాంతో స్కూళ్లలో వస తులు కొంత మెరుగయ్యాయి. ఇంకా చేయాల్సింది వుంటే చేయొచ్చు. కానీ వాటి నిర్మాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయకుండా బాధ్యత హెడ్ మాస్టర్ల మీద పడేసింది. కొంత మంది టీచర్లు ఒత్తి డికి గురికావడంతో ఆరోగ్యం కూడా పాడైంది. స్కూల్ మరుగు దొడ్లు శుభ్రపరచడం కోసం శాశ్వత ఏర్పాట్లు చేయకపోతే బస్టాండ్ల దగ్గర మరుగుదొడ్ల వలే ఉపయోగం లేకుండా పడి ఉంటాయి. మౌలిక సదుపాయాలు కొంత మెరుగైనా చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేకపోతే చేసిన ఖర్చు ఫలితం ఇవ్వదు.
టీచర్-విద్యార్థి నిష్పత్తి మెరుగు కావాలి
జగన్ ప్రభుత్వం నిర్ణయించిన టీచర్-విద్యార్థి నిష్పత్తి ఉపాధ్యాయులకు కష్టం, విద్యార్థులకు నష్టం చేస్తుంది. 60 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు, 90 మందికి ముగ్గురు, అలా ప్రతి ముప్పై మంది విద్యార్థులకు ఒకరు చొప్పున టీచర్లను నియమించాలని నిర్ణయించారు. దీని వలన విద్యార్థులకు నాణ్య మైన విద్య అందించడం సాధ్యం కాదు. ఐదు తరగ తులకు 21 సబ్జెక్టులు చెప్పడం ఇద్దరి వలన సాధ్యమ వుతుందా? ఒకరు ప్రభుత్వ మీటింగులకు వెళ్ళినా, ఒకరు సెలవు పెట్టినా వున్న ఒక్క టీచర్ కాపలా కాయడం తప్ప ఏం చేయగలరు? నాణ్యమైన విద్య కావాలంటే చదువు చెప్పే ఉపాధ్యాయుడు కావాలి. ప్రాథమిక విద్య దెబ్బ తింటే విద్యార్థి భవిష్యత్ తీవ్రంగా నష్టపోతుందని ప్రభుత్వ నేతలకు తెలి యదా? అధికార్లకు తెలియదా? ఎమ్మెల్యేలు, ఎం.పి లు, మంత్రులు తమ పిల్లలను ఈ స్కూళ్ళలో చేర్పిస్తారా? పేదల పిల్లలకు ఎందుకు ఇంత అన్యాయం? పాలకులు విజ్ఞతతో ఆలోచించాలి.
తల్లిదండ్రులు పట్టించుకోవాలి
తమ పిల్లల భవిష్యత్తు కోసం టీచర్లను నియమించాలని పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఉన్నత సమాజానికి ఉత్తమ విద్య అవసరం. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మించ బడుతుందని కొఠారి కమిషన్ చెప్పింది నిజం చేయాలంటే ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ప్రపంచ నాణ్యతా ప్రమాణాలలో మన దేశం విద్యలో బాగా వెనకబడి ఉంది. దేశంలో మన రాష్ట్రం అక్షరాస్యతలో చిట్టచివరన ఉంది. ఈ వాస్తవా లను గుర్తెరిగి ప్రభుత్వం విద్యా నాణ్యత పెంచేందుకు...ఉపాధ్యాయ సంఘాలు కోరినట్లు...విద్యార్థి, టీచర్ నిష్పత్తి 20:1 ఉండేలా టీచర్లను నియమించాలి.
రాష్ట్రాల హక్కును కాజేస్తున్న కేంద్రం
'నూతన విద్యా విధానం-2020'లో మోడీ ప్రభుత్వం తన బాధ్యత నుండి తగ్గి ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ధార్మిక సంస్థలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది. ఉన్నత విద్యను కార్పొరేట్ సంస్థలకు ఇస్తానని చెప్పింది. వంద విదేశీ యూనివర్సిటీలను దేశంలో పెట్టిస్తానని చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి హక్కు, బాధ్యతగా ఉన్న విద్యను కేంద్రం పెత్తనం కిందకు తీసుకుంటున్నది. ప్రాథమిక విద్యతో సహా మొత్తం సిలబస్‌ను కేంద్రమే నిర్ణయిస్తుంది. కేంద్రం చెప్పింది చేయడమే రాష్ట్రాల పని. మనది ఫెడరల్ వ్యవస్థ. కేంద్రానికి కొన్ని హక్కులు, బాధ్యతలు ఉన్నాయి. రాష్ట్రాలకు కొన్ని హక్కులు, బాధ్యతలు ఉన్నాయి. రాష్ట్రం హక్కును కేంద్ర ప్రభుత్వం కబళిస్తుంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు. చంద్రబాబు నోరు మెదపడం లేదు. రైతు, కార్మిక వ్యతిరేక వ్యవసాయ, కార్మిక చట్టాలకు మద్దతుగా బిజెపి కి ఓటు వేసినట్లుగానే...విద్యా చట్టానికి ఈ రెండు పార్టీలు ఓటు వేసినా ఆశ్చర్యం లేదు. కనుక టీచర్లు, విద్యార్థులతో పాటు పౌర సమాజమూ అప్రమత్తం కావాలి.
ఎస్‌సి-ఎస్‌టి-బిసి మహిళలకు ముప్పు
మోడీ నూతన విద్యా విధానంలో సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, లౌకికతత్వం ప్రస్తావనే లేదు. ఆర్‌ఎస్‌ఎస్ తొలి నుండీ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇప్పటికే అనేక సార్లు రిజర్వేషన్లను సమీక్షించాలని డిమాండు చేశారు. అదే మోడీ విద్యా విధానంలో వ్యక్తమయింది. ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నలలో నడపబడుతున్న మనువాద బిజెపి పాలనలో రిజర్వేషన్లు ప్రశ్నార్థకమే. అంతేగాక, ఈ విద్యా విధానంలో టీచర్లతోనే గాక వాలంటీర్లతో కూడా చదువు చెప్పించుకోవచ్చు. నిరుద్యోగ యువతకు మరింత అన్యాయం జరగబోతున్నది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మహిళలకు విద్య నిర్లక్ష్యం చేయబడుతుంది. మనువాదులు ఈ తరగతుల ప్రజలను వందల ఏళ్లు విద్యకు దూరం చేసిన దుష్ఫలితాలు దేశం అనుభవిస్తున్నది. బిజెపి దేశాన్ని మరలా ఆ రోజులకు తీసుకువెళ్ళేలా విద్యా విధానాన్ని రూపొందించింది. మన రాష్ట్రంలో అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధపడుతున్నది.
డిఎస్‌సి తో ముడిపడ్డ బదిలీ సమస్య
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు 13 వేలకు పైనే ఉన్నాయి. డిఎస్‌సి తీయకపోవడంతో వేలాది స్కూళ్ళలో టీచర్ ఖాళీలు నింపలేదు. అసలే టీచర్లు తక్కువ. ఆపైన ఖాళీలు. మరి విద్యార్థులకు చదువు వచ్చేది ఎలా? ఇది ఒక సమస్య. ఉపాధ్యాయుల బదిలీ మరో సమస్య. టీచర్ల బదిలీ కౌన్సిలింగులో ఖాళీలన్నీ చూపితే దూరాన, చివరిలో, కొండల్లో వున్న పాఠశాలల్లో టీచర్లు మిగలరు. కనుక చాలా ఖాళీలను బ్లాక్ చేస్తున్నారు. దీనితో బదిలీ కావాలనుకునే వారికి అన్యాయం జరుగుతున్నది. అదే ప్రతి సంవత్సరం వచ్చే ఖాళీలను భర్తీ చేస్తే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కొంత కాలం దూరాన పని చేసి తరువాత మారవచ్చు.
వెనుకబడిన ప్రాంతాల్లో మరింతమంది టీచర్లు
గిరిజన ప్రాంతంలో జిపిఎస్ స్కూల్ టీచర్లు లేక విద్యా వాలం టీర్లతో నడుస్తున్నాయి. దశాబ్దాల తరబడి సిఆర్‌టి లతో నడిచే స్కూళ్లు వేల సంఖ్యలో ఉన్నాయి. విద్యా వాలంటీర్లను, సిఆర్‌టి లను కూడా విద్యా సంవత్సరం చివరిలో తీసివేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో నియమించడం లేదు. విద్యా సంవత్సరం మధ్యలో నియమిస్తున్నారు. గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతుల పిల్లలకు స్కూల్లో టీచర్ల శ్రద్ధ చాలా అవసరం. వెనుక బడిన ప్రాంతంలో టీచర్ల అవసరం ఎక్కువ. ఎందువలనంటే ఇంటి దగ్గర పిల్లలకు అనుమానాలు నివృత్తి చేసే పరిస్థితి తల్లిదండ్రులకు లేదు. విద్యా వ్యవస్థ బలం మీదే వారి విద్య ఆధారపడి ఉంటుంది. కనుక అక్కడ ప్రభుత్వం ఎక్కువ మంది ఉపా ధ్యాయులను నియ మించాలి. కానీ అందుకు విరుద్ధంగా నడుస్తున్నది. కేరళ వామపక్ష ప్రభుత్వం మినహా అన్ని ప్రభుత్వాలు ...ఏదో విధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకున్నాయి. అందువలనే ఉపాధ్యాయుల నియా మకంలో నిర్లక్ష్యం చేస్తున్నాయి.
యువతను మోసం చేస్తున్నారు
వందల ప్రైవేట్ టీచర్ ట్రైనింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చేసి లక్షల మందికి టీచర్ ట్రైనింగ్ ఇచ్చిన ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి ఉపాధ్యాయ ఖాళీలు నింపక పోవడం, ఎన్నికల ముందు డిఎస్‌సి తీస్తామమని ప్రకటించి, అనంతరం డిఎస్‌సి తీయకపోవడం యువతను మోసం చేయడం కాదా? ప్రభుత్వ ప్రకటనలు చూసి డిఎస్‌సిలో సెలెక్ట్ కావాలని యువత సంవత్సరాల తరబడి కోచింగులకు వేలు, లక్షల రూపాయలు తగలేస్తున్నది. డబ్బు పోయె. ఉద్యోగం రాకపోయె. కాలం వృధా అయ్యే. ఉద్యోగం కోసం ఎదురు చూసే యువతకు ఇంత అన్యాయం చేయడమా? ఉపాధ్యాయులను నియమించక పోవడంతో బదిలీ కావాల్సిన టీచర్లకు ఇబ్బంది కలుగుతున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్య రావాలన్నా, బదిలీ సమస్య పరిష్కారం కావాలన్నా, యువతకు న్యాయం జరగాలన్నా తక్షణమే టీచర్ల నియామకమే పరిష్కారం. అందుకు యువత, ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి.
* ఎం. కృష్ణమూర్తి - (సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సెల్ : 94900 98808)










