Jul 08,2021 17:24

అమరావతి : తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు రాకూడదనే ఉద్దేశ్యంతోనే తెలంగాణలో వైసిపిని విస్తరించలేదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణతో మన ప్రయోజనాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకు అక్కడి రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నది తమ వైఖరి అని చెప్పారు. తెలంగాణలో తాము రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తే అవి ఎపి ప్రయోజనాలకు భంగం కలిగించవచ్చని, లేదా ఇక్కడ ఎపి ప్రజల్లో పలు అనుమానాలకు దారితీయొచ్చని, లేదా అలాంటి అనుమానాలు సృష్టించే శక్తులకు ఊతమివ్వవచ్చని అభిప్రాయపడ్డారు. అందుకే సిఎం జగన్‌ ఎపిలో తప్ప ఇంకెక్కడా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని స్థిర అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు. వైఎస్‌ షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న పార్టీ గతంలో ఆమె ప్రకటించిన మేరకే జరుగుతోందని, ఇందులో తాము మాట్లాడాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామని, ఆ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలని కోరారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాము ఎంత చేయాలో అంతా చేస్తామని పేర్కొన్నారు.